Maha Political Crisis:‘మహా’ సంక్షోభం.. ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు వెనక కారణాలు ఇవేనా!

22 Jun, 2022 14:42 IST|Sakshi

ముంబై: శివసేన పార్టీలో అగ్రశ్రేణి నాయకుడు, మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్న ఏక్‌నాథ్‌ శిండే హఠాత్తుగా తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో ఇటు శివసేన పార్టీలో, అటు ప్రభుత్వ శ్రేణుల్లో తీవ్ర ప్రకంపనాలు ఏర్పడ్డాయి. శివసేన పార్టీకి మొదట్నుంచి ఎంతో నిష్టావంతుడైన ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు వెనక కారణాలను రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు.

బాలాసాహెబ్‌ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడైన ఏక్‌నాథ్‌ శిండే అసంతప్తికి గురికావడానికి, తిరుగుబాటు చేయడానికి కారణం తనకు దక్కాల్సిన ముఖ్యమంత్రి పదవి మధ్యలో ఉద్ధవ్‌ ఠాక్రే రావడం వల్ల చేజారిపోయిందని భావించటం ఒకటైతే, హిందూత్వ పార్టీగా పేరుపొందిన శివసేన, బాలాసాహెబ్‌ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి ఎన్సీపీ, కాంగ్రెస్‌లాంటి బాలాసాహెబ్‌ ఠాక్రే వ్యతిరేక పార్టీలతో జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రెండవది అని కొందరు రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు.

శరద్‌ పవార్‌ దౌత్యం ఫలించి ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో జతకట్టిన మొదట్లో ఏక్‌నాథ్‌ షిండేకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతారని అనుకున్నారు. ఏనాడూ ప్రభుత్వ పదవుల్ని ఆశించని ఠాక్రే కుటుంబం అకస్మాత్తుగా పదవిని ఆశించడం షిందేకు తీవ్ర నిరాశను కలిగించింది. ముఖ్యమంత్రి కావాల్సిన తనకు మంత్రి వర్గంలో సైతం తగినంత ప్రాధాన్యత దక్కకపోవడంతో లోలోన తీవ్ర అసంతప్తికి గురయ్యాడనీ కొందరు సన్నిహితులు చెబుతున్నారు. 
సంబంధిత వార్త: ఉద్దవ్‌ థాక్రేపై ఫడ్నవీస్‌ భార్య ట్వీట్‌!

నిధులివ్వకుండా అవమానించారు.. 
హిందుత్వకు ప్రతీకగా పేరుపొందిన శివసేన పార్టీ అవకాశవాద పార్టీగా మారిందని, పదవుల కోసం బాలా సాహెబ్‌ సిద్ధాంతాలను మంటగలుపుతోందనీ, సెక్యులరిజం పేరుతో హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మీడియాలో వస్తున్న విమర్శలు కూడా ఏక్‌నాథ్‌ షిండేను ఆందోళనకు గురిచేశాయంటారు. ఆర్థిక మంత్రిగా ఎన్సీపీకి చెందిన వ్యక్తి ఉండడం వల్ల కూడా అవసరమైన నిధుల్ని విడుదల చేయడంలో విపరీతమైన జాప్యం జరగడం కూడా షిందే అసంతప్తికి మరోకారణంగా చెబుతున్నారు.

తనను ఫ్లోర్‌ లీడర్‌ పదవి నుండి తొలగించడంపై ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘నేను ఎప్పటికీ బాలాసాహెబ్‌ ఠాక్రే శిష్యుడినేననీ, నిఖార్సయిన శివసైనికుడినని.. పదవుల కోసం తిరుగుబాటు చేయడం బాలాసాహెబ్‌ తనకు నేర్పలేదనీ.. హిందుత్వం కోసమే తాను తిరుగుబాటు చేస్తున్నాననీ.. శివసేన సిద్ధాంతాలను నమ్ముకున్న 35 మంది శాసన సభ్యులు తన వెంట ఉన్నారనీ’ చెప్పుకొచ్చాడు. అంతేగాకుండా, తాను తిరిగిరావాలంటే, శివసేన పార్టీ ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తు తెంపుకొని, బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా కండిషన్‌ విధించాడు.
సంబంధిత వార్త: ‘మహా’లో మరో ట్విస్ట్‌.. సీఎం ఉద్ధవ్‌ థాక్రే, గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌

తాజా సమాచారం ప్రకారం షిండేను బుజ్జగించేందుకు ఉద్దవ్‌ ఠాక్రే సతీమణి రష్మి ఠాక్రే కూడా రంగంలోకి దిగారు. ఆమె ఏక్‌నాథ్‌ శిండేతో మాట్లాడారనీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా శిండేతో మాట్లాడారనీ తెలిసింది.  ఏక్‌నాథ్‌ షిండేతో మాట్లాడేందుకు ఉద్దవ్‌ ఠాక్రే ఇద్దరు దూతల్ని సూరత్‌ పంపిస్తున్నట్లుగా సమాచారం. ఈ తిరుగుబాటు వెనక బీజేపీ హస్తమున్నట్లుగా కొందరు శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా బుధవారం సాయంత్రానికి పరిణామాలపై స్పష్టత రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిందిదీ.. 
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్ధానాలున్నాయి. అందులో  బీజేపీ–106, శివసేన–56, ఎన్సీపీ–53, కాంగ్రెస్‌–44, ఎంఐఎం–2, ఆర్‌ఎస్పీ–1, జేఎస్‌ఎస్‌–1, ఇండిపెండెంట్లు, ఇతరులు–24 (శివసేనకు చెందిన ఓ స్ధానం ఖాళీ ఉంది) ఇలా బలాబలాలున్నాయి. ఈ నెల 10న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగి బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్ధులు గెలిచారు. తాజాగా సోమవారం జరిగిన విధాన్‌ పరిషత్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ ఐదుగురు అభ్యర్ధులను గెలిపించుకుని మహా వికాస్‌ ఆఘాడి ప్రభు త్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ముఖ్యంగా శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఇతరుల బలమున్నప్పటికీ కేవలం 52 ఓట్లు పోలయ్యాయి. అదే బీజేపీకి తగినంత సంఖ్యా బలం లేకపోయినప్పటికీ 134 ఓట్లు పోల్‌ అయ్యాయి. దీన్ని బట్టి బీజేపీకి 134 మంది సభ్యుల బలముందని స్పష్టమవుతోంది. మెజార్టీ నిరూపించుకోవాలంటే కేవలం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.

ఏక్‌నాథ్‌ షిండేసహా ఆయన మద్దతుదారులు 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో ప్రవేశిస్తుండవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం ప్రమాదంలో పడిపోయే ఆస్కార ముంది. దీంతో మంగళవారం శివసేన పార్టీ కార్యాలయమైన సేన భవన్‌కు ఎమ్మెల్యేలందరు వెంటనే హాజరు కావాలని ఉద్ధవ్‌ ఠాక్రే ఆదేశించారు. కాని సేనా భవన్‌లోకి షిండే వర్గం మినహా కేవలం 21–24 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు