రిసెప్షనిస్ట్‌ హత్యోదంతం.. బుల్డోజర్లతో రిసార్ట్‌ కూల్చివేత.. లైంగిక దాడి అనుమానాలు!

24 Sep, 2022 10:35 IST|Sakshi
నిందితులు(ఎడమ), బాధితురాలు అంకిత(కుడి).. ఇన్‌సెట్‌లో రిసార్ట్‌ కూల్చివేత దృశ్యం

ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్‌ హత్యోదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. స్థానిక బీజేపీ నేత వినోద్‌ ఆర్య కొడుకు పుల్కిత్‌ ఆర్య.. 19 ఏళ్ల యువతి హత్య కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తక ముందే కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం భావించింది. 

Uttarakhand receptionist murder: యువతి హత్య ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు మొదలవుతున్న క్రమంలో.. సీఎం పుష్కర్‌ ధామి ఆదేశాలనుసారం బుల్డోజర్‌లు రంగంలోకి దిగాయి. రిషికేష్‌లో పుల్కిత్‌కు చెందిన వనతారా రిసార్ట్‌ను బుల్డోజర్లు కుప్పకూల్చాయి. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అభినవ్‌ కుమార్‌ దగ్గరుండి ఈ కూల్చివేతను పర్యవేక్షించడం గమనార్హం. ఈ కూల్చివేత.. నేరం చేయాలనుకునేవాళ్లకు భయం పుట్టిస్తుందని యమకేశ్వర్‌ ఎమ్మెల్యే రేణు బిష్ట్‌ చెప్తున్నారు. ఈ ఘటనలో చర్యలకు ఆదేశించిన సీఎం ధామికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు.. బాధితురాలి తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిని సస్పెండ్‌ చేసినట్లు ఆమె వెల్లడించారు.

ఇక కేసులో నిందితులైన పుల్కిత్‌ ఆర్యతో పాటు రిసార్ట్‌ మేనేజర్‌ సౌరభ్‌భాస్కర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ అకింత్‌ గుప్తాలను అరెస్ట్‌ చేసి.. జ్యూడీషియల్‌ కస్టడీకి తరలించారు ఉత్తరాఖండ్‌ పోలీసులు. 

ఘటన దురదృష్టకరం. కానీ, పోలీసులు ఈ కేసును వీలైనంత త్వరగా చేధించారు. నిందితులను అరెస్ట్‌ చేశారు. నేరస్తులు ఎలాంటి వాళ్లైనా.. కఠిన చర్యలు కచ్చితంగా ఉంటాయి అని సీఎం ధామి స్పష్టం చేశారు. 

హరిద్వార్‌కు చెందిన బీజేపీ నేత వినోద్‌ ఆర్య.. ఉత్తరాఖండ్ మతి కళా బోర్డుకు గతంలో చైర్మన్‌గా కూడా పని చేశారు. ఈయన కొడుకే పుల్కిత్‌ ఆర్య. సెప్టెంబర్‌ 18 నుంచి రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే అంకిత భండారి కనిపించకపోగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. దాదాపు వారం తర్వాత ఆమె హత్యకు గురైందన్న విషయం బయటపడింది. ఇదిలా ఉంటే.. శనివారం ఉదయం ఆమె మృతదేహాన్ని కాలువ నుంచి కనుగొన్నారు పోలీసులు. అయితే.. తన కూతురిపై లైంగిక దాడి జరిగిందని, ఇందుకు సంబంధించిన ఆడియో సాక్ష్యం తమ వద్ద ఉందని బాధితురాలి తండ్రి చెప్తున్నారు.

ఇదీ చదవండి: సీఎంగా వారసుడిని ప్రకటించాల్సింది ఇక వాళ్లే!

మరిన్ని వార్తలు