‘నా కొడుకు నిర్దోషి’.. రిసెప్షనిస్ట్‌ హత్య కేసు నిందితుడి తండ్రి కీలక వ్యాఖ్యలు

25 Sep, 2022 13:51 IST|Sakshi

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌, రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే యువతి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుల్‌కిత్‌ ఆర్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. ఆ మరుసటి రోజున నిందితుడి తండ్రి వినోద్‌ ఆర్య, సోదరుడు అంకిత్‌ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ క్రమంలో తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు బీజేపీ మాజీ నేత వినోద్‌ ఆర్య. పుల్‌కిత్‌ అమాయకుడని పేర్కొన్నారు. 

‘అతడు ఒక సాదా సీదా అబ్బాయి. తన పనేదో తాను చూసుకుంటాడు. నా కుమారుడు పుల్‌కిత్‌, హత్యకు గురైన యువతి ఇరువురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. పుల్‌కిత్‌ ఇలాంటి వాటిలో ఎప్పుడూ పాల్గొనలేదు. అతడు నిర్దోషి.’ అని తెలిపారు వినోద్‌ ఆర్య. చాలా రోజులుగా పులికిత్‌ తమ కుటుంబానికి దూరంగా జీవిస్తున్నాడని చెప్పారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరగాలనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

హత్యకు గురైన రిసెప్షనిస్ట్‌, 19 ఏళ్ల యువతి పని చేస్తున్న రిసార్ట్‌ ఓనర్‌ పుల్‌కిత్‌ ఆర్య, మేనేజర్‌ సౌరభ్‌ భాస్కర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ అంకిత్‌ గుప్తాలను శుక్రవారమే అరెస్ట్‌ చేశారు పోలీసులు. దర్యాప్తులో నిందితులు తెలిపిన వివరాలు, బాధితురాలి మొబైల్‌ ఫోన్‌ ఛాటింగ్‌ ప్రకారం..టూరిస్టులకు ‘ప్రత్యేక సేవలు’ అందించాలని ఆమెపై ఒత్తిడి చేసినట్లు తేలిందని పోలీసు అధికారి అశోక్‌ కుమార్‌ శనివారం వెల్లడించారు.

నిందితుడు పుల్‌కిత్‌ ఆర్య, హత్యకు గురైన యువతి

ఇదీ చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ

మరిన్ని వార్తలు