విజృంభిస్తున్న కరోనా : రికార్డు పెళ్ళిళ్లు

26 Nov, 2020 14:37 IST|Sakshi

సెలబ్రిటీల వెడ్డింగ్‌ డెస్టినేషన్‌  రాజస్థాన్‌

జైపూర్‌లో ఒక వారంలోనే నాలుగువేలకు పైగా  పెళ్ళిళ్ళు

ఆందోళనలో అధికారులు, కఠిన నిబంధనలు

జైపూర్‌: ఒకవైపు పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ మహమ్మారి కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మరోవైపు కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ నిబంధనలు కారణంగా  ఇన్నాళ్లూ వివాహ కార్యక్రమాలకు బ్రేక్‌ చెప్పిన తాజాగా కల్యాణ వైభోగమే అంటూ వేలాది జంటలు పెళ్లిపీటలెక్కేందుకు రడీ అయిపోతున్నారు. దీంతో నవంబరు చివరి వారంలో రికార్డు స్థాయిలో సందడి నెలకొంది.

ప్రధానంగా రాజస్థాన్‌ రికార్డు పెళ్ళిళ్లకు వేదికగా మారిపోయింది. ఇక్కడ నవంబర్ 30 వరకు రికార్డు సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. రాష్ట్ర రాజధాని నగరం ఒక్క జైపూర్‌లో రికార్డు స్థాయిలో 4,000 వివాహాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సీజన్లో ఈ మూడు రోజులు దివ్యమైన ముహూర్తాలు (నవంబర్ 25, 27, 30తేదీలు)  అత్యంత పవిత్రమైనవిగా భావిస్తున్నారు. దీంతో వివాహ కార్యక్రమాల హడావిడి జోరందుకుంది. ఫలితంగా అధికారుల్లో అందోళన నెలకొంది. అతిధులతోపాటు, వివాహ వ్యాపారంలో కీలకమైన క్యాటరింగ్‌, బాజా భజంత్రీలు, పూజారులు, తదితర వర్గాల వారు అధికంగా కరోనా బారిన పడే అవకాశం ఉందని  భావిస్తున్నారు.

రాష్ట్రంలో రోజుకు మూడు వేలకు పైగా కరోనావైరస్ కేసులు నమోదవుతున్న తరుణంలో తాజా పరిణామం అధికారులలో ఆందోళన రేపుతోంది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెళ్లిళ్లకు హాజరయ్యే అతిధుల సంఖ్య 100 మందికి పరిమితం చేశారు. అలాగే కచ్చితంగా మాస్క్‌లను ధరించడం, శానిటైజర్ల వాడకం, వివాహ వేదికలలో సామాజిక దూరం లాంటి నిబంధనలను పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. 144 సెక్షన్‌ను విధించడంతో పాటు బారాత్‌లను నిషేధించామని రాజస్థాన్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కేకే శర్మ తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారికి 10 నుంచి 25 వేల రూపాయల జరిమానా కూడా విధించనున్నట్టు స్పష్టం చేశారు.

అయితే కరోనా నిబంధనల కారణంగా చాలామంది స్నేహితులు, దగ్గరి బంధువులు కూడా వివాహ వేడుకలకు హాజరు కాలేకపోతున్నారని కొంతమంది వాపోతున్నారు.  తన స్నేహితులు చాలా మంది హాజరు కాకపోవడం బాధగా ఉన్నా..ఇదే మంచిదని  భావిస్తున్నానని నూతన వధువు నిహారికా సింగ్ చెప్పారు. మరోవైపు ఈ జరిమానాల వల్ల  కరోనా గ్రాఫ్‌ను తగ్గించలేమని నిపుణులటున్నారు. దీపావళి ఉత్సవాల తరువాత వైరస్ కేసులు పెరగడాన్ని ఉదహరిస్తూ, వివాహ షాపింగ్, వేడుకలతో కూడా కరోనా విస్తరిస్తుందని  అభిప్రాయపడుతున్నారు.

కాగా రాజస్థాన్‌లో కోవిడ్ కేసులు గత నాలుగు రోజుల నుండి 1.34 శాతం  పెరిగాయి. రాష్ట్రంలో అత్యధికంగా  జైపూర్‌లో రోజులు 600కి పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జైపూర్‌లో రాత్రి కర్ఫ్యూ లాంటి చర్యలను అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలు, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌, జైపూర్‌ లాంటి ప్రఖ్యాత ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి కుమార్తె వివాహం రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోనే జరిగింది అలాగే  టాలీవుడ్‌ నటుడు కొణిదెల నాగబాబు తనయ నిహారిక వెడ్డింగ్‌ డెస్టినేషన్‌  కూడా  రాజస్థాన్‌ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు