Cyber Crime: ఏడాదిలో రూ.60,414 కోట్ల సైబర్‌ మోసాలు

21 Aug, 2022 10:08 IST|Sakshi

ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో మధ్యలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం పెరిగింది. ఏదో ఒక రకంగా మభ్యపెట్టి నగదు దోచేస్తారు. విద్యావంతులు కూడా వీరి వలలో పడడం కొత్త కాదు. అలా పోయిన డబ్బు పోలీసులకు, బ్యాంకులకు ఫిర్యాదు చేస్తే 100 శాతం తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే సైబర్‌ నేరాలకు గురికాకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం.   

బనశంకరి: డబ్బు వ్యవహారాలు ఆన్‌లైన్‌ అయ్యేకొద్దీ ఆర్థిక నేరాలు తీవ్రమవుతున్నాయి. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం 2021– 22 లో రూ.60,414 కోట్ల మేర సైబర్‌ మోసాలు చోటుచేసుకున్నాయి. సైబర్‌ మోసగాళ్ల వల్ల డబ్బు కోల్పోయిన 75 శాతం మంది బాధితులకు ఆ సొమ్ము తిరిగి రావడం లేదు. లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ సైబర్‌ నేరాల బాధితులను మూడేళ్ల పాటు సర్వే చేయగా, వారిలో 74 శాతం మందికి  ఇప్పటికీ డబ్బు వాపస్‌ కాలేదని తెలిసింది.

సర్వేలో మొదటి ప్రశ్నగా గత మూడేళ్లలో మీరు, లేదా మీ బంధువులు, పరిచయస్తులు నగదు వంచనకు గురయ్యారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు 11,065 మంది స్పందించగా, అందులో 38 శాతం మంది తమ కుటుంబంలో కనీసం ఒకరు మోసపోయారని తెలిపారు. 54 శాతం జాగ్రత్త పడ్డామని పేర్కొన్నారు.  

కొంత మందికే తిరిగి దక్కింది 
ఎవరికైనా డబ్బు తిరిగి వచ్చిందా అని అడగ్గా, 10,995 మంది స్పందించారు, వీరిలో  10 శాతం మంది అవు­ను, ఫిర్యాదు చేసి డబ్బు వెనక్కి తీసుకున్నాం అని తెలిపారు. 19 శాతం మంది ఏ ఫలితమూ లేదని బాధ వెళ్లగక్కారు. ఇంకా 19 శాతం మంది ఫిర్యాదు చేశా­మ­ని చెప్పగా, మిగిలిన 9 శాతం మంది పోయిన డబ్బు గురించి  ఆలోచించడం లేదని చెప్పారు. మొ­త్తం 74 శాతం మంది బాధితులకు వారి డబ్బు తిరిగి రాలేదు.  

కంప్యూటర్, మొబైల్‌లో పాస్‌వర్డ్స్‌  
33 శాతం మంది తమ బ్యాంక్‌ అకౌంట్, డెబిట్‌ లేదా క్రెడిట్‌కార్డు పాస్‌వర్డ్స్, ఆధార్, పాన్‌కార్డు నంబర్లను కంప్యూటర్‌లో దాచుకున్నారు. 11 శాతం మంది ఈ వివరాలు అన్నింటిని మొబైల్‌లో భద్రపరచుకున్నట్లు చెప్పారు. దీంతో సులభంగా వంచకులు, హ్యాకర్లు చేతికి అందడంతో వంచనకు గురిఅవుతున్నారు.  

ఇ కామర్స్‌ ద్వారా అధిక మోసాలు

  • ఇక ఎలా వంచన జరిగింది అన్న ప్రశ్నకు 9,936 మంది స్పందించగా 29 శాతం మంది బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా మోసానికి గురైనట్లు తెలిపారు.  
  • ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్స్, వెబ్‌సైట్లలో కొనుగోళ్లు (ఇ–కామర్స్‌) వల్ల 24 శాతం మంది వంచనకు గురయ్యారు. ఇదే అత్యధికం.  
  • 18 శాతం మంది క్రెడిట్‌ కార్డులతో మోసపోయారు. 
  • 12 శాతం మందిని మోసపూరిత మొబైల్‌ అప్లికేషన్లు లూటీ చేశాయి.  
  • 8 శాతం మంది డెబిట్‌ కార్డులు, 6 శాతం మంది బీమా పేర్లతో నష్టపోయారు.  
  • సైబర్‌ వంచనకు గురైనవారు తక్షణం పోలీస్‌ సహాయవాణి 112 నంబరుకు ఫోన్‌ చేస్తే  పోయిన డబ్బు వెనక్కి తీసుకోవడానికి ఎక్కువ  అవకాశం ఉంటుంది.  
మరిన్ని వార్తలు