ఉగ్రవాదుల్ని విడిపించడమే ‘ఎర్రటోపీ’ల లక్ష్యం

8 Dec, 2021 04:32 IST|Sakshi

అందుకు అధికారంలోకి రావాలని చూస్తున్నారు

సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్యలు

యూపీలో ఎరువుల ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌ను జాతికి అంకితమిచ్చిన ప్రధాని

గోరఖ్‌పూర్‌(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో ‘ఎర్ర టోపీ’లు ఉగ్రవాదులకు వంతపాడుతున్నాయని, టెర్రరిస్టులను జైళ్ల నుంచి విడిపించేందుకు అధికారంలోకి రావాలని చూస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీనుద్దేశిస్తూ మోదీ మాట్లాడారు. మంగళవారం గోరఖ్‌పూర్‌లో భారీ ఎరువుల ఫ్యాక్టరీ, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చిన సందర్భంగా మోదీ ప్రసంగించారు. ‘మొత్తం యూపీకి తెలుసు. ఎర్ర టోపీలు మళ్లీ ఎర్ర బుగ్గ కార్లలో తిరగాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. పేదల కష్టాలు, బాధలను తీర్చాలని ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు మళ్లీ ఎర్రటోపీలు(ఎస్‌పీ పార్టీ టోపీ) అధికార దాహంతో ఉన్నాయి. అధికార పగ్గాలు చేపట్టి ఆక్రమణలు, కుంభకోణాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉగ్రవాదులు, మాఫియా వ్యక్తులను జైళ్ల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు’అంటూ సమాజ్‌వాదీ పార్టీని పరోక్షంగా విమర్శించారు.  హిందుస్తాన్‌ ఉర్వారక్‌ రసాయన్‌ (హెచ్‌యూఆర్‌ఎల్‌) ఆధ్వర్యంలో భారీ ఎరువుల ఉత్పత్తి కర్మాగారం, రూ.1,011 కోట్లతో ఎయిమ్స్, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్స్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) వారి ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం మొత్తంగా రూ.9,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ మంగళవారం గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు.

రెడ్‌ క్యాప్‌ బీజేపీకి రెడ్‌ అలర్ట్‌: అఖిలేశ్‌
ఎస్‌పీ పార్టీ రంగులో ఉండే రెడ్‌ క్యాప్‌ అంటే బీజేపీకి రెడ్‌ అలర్ట్‌తో సమానమని ఎస్‌పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ సమాధానమిచ్చారు. ‘యూపీలో యోగి సర్కార్‌ అప్రమత్తంగా(రెడ్‌ అలర్ట్‌)గా ఉండాల్సిందే. మిమ్మల్ని అధికార పీఠం మీద నుంచి కింద పడేసేది మేమే. లఖీమ్‌పూర్‌ ఖేరీ ఘటన, ధరల పెరుగుదల, నిరుద్యోగిత, విద్యావ్యవస్థ విధ్వంసం.. మీ ప్రభుత్వ పతనానికి సంకేతాలు. 2022లో అధికార మార్పు తథ్యం’ అని అఖిలేశ్‌ హిందీలో ట్వీట్‌ చేశారు. 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో పట్టు సాధించాలంటే ఇందులో 160 స్థానాలున్న పూర్వాంచల్‌ ప్రాంతం కూడా కీలకమేనని బీజేపీ భావిస్తోంది. 

హాజరు ఇలాగేనా..?
ఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ ఎంపీల గైర్హాజరీపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీలు తమ వైఖరిమార్చుకోకపోతే, భవిష్యత్‌లో మార్పులు చవిచూడాల్సి వస్తుందన్నారు. చెబితే పిల్లలైనా వింటారు, కానీ, ఎంపీల్లో మార్పు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఈనెల 14న ప్రధాని తన నియోజకవర్గం వారణాసిలోని పార్టీ జిల్లా, మండల అధ్యక్షులతో ‘చాయ్‌ పే చర్చా’ నిర్వహిస్తున్నారని, అలాగే ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో నిర్వహించాలని నడ్డా పిలుపునిచ్చారు.  ఢిల్లీలోని అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో మంగళవారం జరిగిన ఈ భేటీ వివరాలను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రి ప్లహ్లాద్‌ జోషీ మీడియాతో పంచుకున్నారు.

మరిన్ని వార్తలు