ఆహార భద్రతకు ఆ రెండూ కీలకం

17 Oct, 2020 04:32 IST|Sakshi

మద్దతు ధర, ప్రభుత్వ సేకరణలపై ప్రధాని మోదీ

ఆడపిల్లల వివాహ వయో పరిమితిపై త్వరలో నిర్ణయం

న్యూఢిల్లీ: రైతులు పండించిన పంటలను మద్దతు ధరతో సేకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్పష్టం చేశారు. దేశ ఆహార భద్రతకు ఈ రెండు అంశాలు ముఖ్యమైనవని ఆయన తెలిపారు. వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా కనీస మద్దతు ధర విధానం శాస్త్రీయమైన పద్ధతిలో కొనసాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రపంచ ఆహార భద్రత విషయంలో భారత్‌ నిబద్ధతకు ఇటీవలి వ్యవసాయ సంస్కరణలే నిదర్శనమని ఆయన వివరించారు.

అంతర్జాతీయ సంస్థ ‘‘ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌’ ఏర్పాటై 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని మోదీ రూ.75 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరేళ్లలో మండీల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రూ.2,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు సాగును విస్తృతం చేసేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకూ ఉద్దేశించినవని వివరించారు. ఎసెన్షియల్‌ కమాడిటీస్‌ చట్టంలో చేసిన మార్పులతో మండీల మధ్య పోటీతత్వం ఏర్పడుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరగడంతోపాటు ఆహార వృథాను అరికట్టవచ్చునని ప్రధాని చెప్పారు.

‘‘ఇప్పుడు మార్కెట్లే చిన్న, సన్నకారు రైతుల ఇంటి ముందుకు వచ్చేస్తాయి. అధిక ధరలు అందేలా చేస్తాయి. దళారులు లేకుండా పోతారు’’అని వివరించారు. కోవిడ్‌–19 కాలంలో భారత ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల విలువైన తిండిగింజలను 80 కోట్ల మందికి అందించిందని మోదీ తెలిపారు. ఈ ఉచిత రేషన్‌ అనేది యూరప్, అమెరికాలోని జనాభా కంటే ఎక్కువ మందికి అందించామని అన్నారు. పోషకాహార లోపాలను అధిగమించేందుకు కేంద్రం సిద్ధం చేసిన ఎనిమిది పంటల 17 బయో ఫోర్టిఫైడ్‌ వంగడాలను మోదీ విడుదల చేశారు. 2023 సంవత్సరాన్ని ‘‘ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌’గా ఆచరించేందుకు ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ అంగీకరించడం అధిక పోషక విలువలున్న ఆహారానికి ప్రోత్సాహమివ్వడంతోపాటు చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహకంగా  ఉంటుందన్నారు.

వంగడాలతో కొత్త వెరైటీలు
ప్రధాని జాతికి అంకితం చేసిన 17 కొత్త వంగడాల్లో ప్రత్యేకతలు ఎన్నో. కొన్ని పోషకాలు సాధారణ వంగడాల కంటే మూడు రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. స్థానిక వంగడాలు, రైతులు అభివృద్ధి చేసిన వంగడాల సాయంతో కొత్త వెరైటీలను సిద్ధం చేశారు.

► ఇనుము, జింక్, కాల్షియం, ప్రొటీన్, లైసీన్, ట్రిప్టోఫాన్, విటమిన్లు ఏ, సీ, యాంథోసైనిన్, ఓలిక్‌ యాసిడ్, లినోలిక్‌ యాసిడ్ల వంటి పోషకాలను వీటితో పొందవచ్చు.  
► సాధారణ వంగడాల్లో పోషకాలకు వ్యతిరేకంగా పనిచేసే యురుసిక్‌ ఆసిడ్, ట్రిప్సిన్‌ నిరోధకం తదితరాలు కొత్త వంగడాల్లో తక్కువగా ఉంటాయి.
► కొత్త వంగడాల్లో రెండింటిని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) అభివృద్ధి చేసింది. గిర్నార్‌ –4, గిర్నార్‌ –5 అని పిలుస్తున్న ఈ రెండు వేరుశనగ వంగడాల్లో ఓలిక్‌ ఆసిడ్‌ మోతాదు ఎక్కువ. సబ్బులు, ఫార్మా, వస్త్ర పరిశ్రమల్లో ఓలిక్‌ ఆసిడ్‌ను ఉపయోగిస్తారు.
► జాతికి అంకితం చేసిన వాటిల్లో గోధుమ వంగడాలు ఐదు ఉండగా.. మొక్కజొన్న వంగడాలు మూడు, రాగులు, వేరుశనగ రెండు చొప్పున ..వరి, సామలు, ఆవాలు, కంద వంగడాలు ఒక్కొక్కటి ఉన్నాయి. ఇంకో వంగడం వివరాలు తెలియాల్సి ఉంది.  

ఆడపిల్లల వివాహ వయో పరిమితిపై త్వరలో నిర్ణయం
ఆడపిల్లల కనీస వివాహ వయో పరిమితిపై కేంద్రం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వివాహానికి తగిన వయసు ఏమిటన్న విషయంపై ముఖ్యమైన చర్చలు జరుగుతున్నాయని, కనీస వయో పరిమితిని సవరించేందుకు ఏర్పాటైన కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆరేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా బాలికలు ఎక్కువ సంఖ్యలో బడిలో చేరుతున్నారని ఫలితంగా స్థూల నమోదు నిష్పత్తిలో తొలిసారి బాలికలు పై చేయి సాధించారని వివరించారు. స్వాతంత్య్ర దినో త్సవ ప్రసంగంలో భాగంగా మోదీ ఆడపిల్లల వివాహ కనీస వయో పరిమితిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఆడపిల్లల వివాహ కనీస వయో పరిమితి 18 ఏళ్లు కాగా, పురుషుల విషయంలో ఇది 21 ఏళ్లుగా ఉంది.

మరిన్ని వార్తలు