వెయ్యి పడకలతో కోవిడ్‌ ఆసుపత్రి: రిలయన్స్‌

30 Apr, 2021 18:36 IST|Sakshi

గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో కోవిడ్‌ ఆసుపత్రి: రిలయన్స్‌ 

మొత్తం రెండు వారాల్లో పూర్తి

సాక్షి, గాంధీనగర్: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ దేశీయ అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్) పెద్దమనసు చాటుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుజరాత్‌లో జామ్‌నగర్‌లో కరోనా రోగుల కోసం పెద్ద కోవిడ్‌ ఆసుపత్రిని  ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. 1000 పడకల కోవిడ్-19 ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది. మొదటి దశలో 400 పడకలు ఒక వారంలో, మరో 600 పడకలు మరో వారంలో సిద్ధంగా ఉంటాయని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రకటించారు. (కరోనా విలయం: చూస్తే కన్నీళ్లాగవు: వైరల్‌ ట్వీట్‌)

ఆర్‌ఐఎల్ చెందిన రిలయన్స్ ఫౌండేషన్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఆక్సిజన్ సౌకర్యంతో ఈ కోవిడ్-19 ఆసుపత్రిని ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు ఈ కోవిడ్ కేర్ ఫెసిలిటీలో అన్ని సేవలను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అత్యుత్తమైన, నాణ్యమైన సేవలను ఉచితంగానే అందిస్తామని నీతా అంబానీ చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభ్యర్థనకు ప్రతిస్పందనగా ఆర్‌ఐఎల్  ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు. వచ్చే ఆదివారం నాటికి జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 400 పడకల ఆసుపత్రిని ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఆ తర్వాతి వారంలో 1000 పడకలకు ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. కాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 3.86లక్షల కొత్త కేసులు నమోదు కాగా, 3498  మంది మృత్యువాత పడ్డారు.  గుజరాత్‌లో (గురువారం) కొత్తగా14,327 కేసులు నమోదు కాగా 180 కరోనాతో మృతి చెందారు. గుజరాత్‌లో ఎక్కువగా ప్రభావితమైన 10 జిల్లాల్లో మే 1 నుంచి 18-45 ఏళ్లలోపు వారికి టీకా డ్రైవ్ ప్రారంభ మవుతుందని సీఎం విజయ్ రూపానీ శుక్రవారం ప్రకటించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు