కోవిడ్‌ వారియర్స్‌కు భారీ ఊరట

20 Apr, 2021 18:52 IST|Sakshi

కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారియర్స్‌ కుటుంబాలకు రూ.50 లక్షలు సాయం

ఈ నెల 24 నుంచి కొత్త బీమా విధానం అమల్లోకి : కేంద్ర ఆరోగ్య శాఖ

సాక్షి న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ(పీఎంజీకేపీ) కింద కోవిడ్‌-19 వారియర్స్‌కు ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి కొత్త బీమా విధానం అమల్లోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అప్పటిలోగా బీమా క్లెయిమ్‌ల చెల్లింపులను పూర్తి చేస్తామని ప్రకటించింది. కరోనా వారియర్స్‌ కోసం కొత్తగా అమల్లోకి తేనున్న బీమా కవరేజీ విధానంపై న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. కరోనా వారియర్స్‌కు సంబంధించి 287 క్లెయిమ్‌ల చెల్లింపులను ఇప్పటి వరకు బీమా కంపెనీ పూర్తి చేసినట్లు ట్విట్టర్‌లో వివరించింది.విధి నిర్వహణలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు దీని ద్వారా రూ.50 లక్షలు అందుతాయి.

మరోవైపు దేశంలో కరోనా చాపకింద నీరులా త్వరితగతిన విస్తరిస్తోంది. రికార్డు స్తాయిలో రోజువారీ పాజిటివ్‌ కేసుల మంగళవారం 2.59 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారతదేశం 1,761 కోవిడ్ మరణాలను నమోదు చేసింది,  మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1.53 కోట్లకు పైగా ఉంది. దీంతో పలు రాష్ట్రాల్లో కఠినమైన కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ వారం రోజుల పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించగా,  మరో కరోనా ప్రభావిత రాష్ట్రం మహారాష్ట్ర కూడా లాక్‌డౌన్‌ దిశగా  అడుగులు వేస్తోంది.

చదవండి :   ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు కరోనా: పరిస్థితి విషమం
కరోనా రోగులకు డీఆర్‌డీవో  అద్భుత పరికరం

>
మరిన్ని వార్తలు