మతం మారితే బహిరంగపరచాలి

31 Oct, 2021 05:07 IST|Sakshi

మత మార్పిడి నిరోధక చట్టాల్ని స్వాగతిస్తామన్న ఆరెస్సెస్‌  

ధార్వాడ్‌: మత మార్పిడుల్ని నిరోధించాలని, ఒకవేళ ఎవరైనా మతం మారితే బహిరంగంగా వెల్లడించాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అభిప్రాయపడింది. మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఏ రాష్ట్రమైనా తీసుకువస్తే తాము స్వాగతిస్తామని స్పష్టం చేసింది. అఖిల భారతీయ కార్యకారి మండల్‌ (ఏబీకేఎం) మూడు రోజుల సమావేశం ముగిసిన అనంతరం ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే శనివారం మీడియాతో మాట్లాడారు. మతమార్పిడుల్ని నిరోధించాలన్నదే ఆరెస్సెస్‌ విధానమన్నారు. ఒకవేళ ఎవరైనా మతం మార్చుకుంటే దానిని బహిరంగంగా వ్యక్తపరచాలని డిమాండ్‌ చేశారు.

మతం మారిన తర్వాత కూడా బయటపెట్టకపోతే వారు రెండు రకాలుగా లబ్ధిని పొందుతున్నారని అన్నారు. బలవంతపు మత మార్పిడుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని అన్నారు. అందుకే మత మార్పిడి నిరోధక చట్టాన్ని మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. బలవంతగా మత మార్పిడిని ఆరెస్సెసే కాదు మహాత్మా గాంధీ కూడా వ్యతిరేకించారని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు పదికి పైగా రాష్ట్రాలు మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చాయన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ హయాంలో వీరభద్ర సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు.   

మరిన్ని వార్తలు