ఈవీఎంలో పార్టీ గుర్తుల తొలగింపునకు సుప్రీం నో

2 Nov, 2022 02:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎం, బ్యాలెట్లపై పార్టీ గుర్తులు నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈవీఎంలో అభ్యర్థి పేరు, వయసు, విద్యార్హత, ఫొటోలు ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం విచారించింది. ఈవీఎంలో పార్టీ గుర్తులుండడంపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికలు పార్టీలతో ముడిపడి ఉంటాయని, పిటిషన్‌ను అంగీకరిస్తే అభ్యర్థి గెలిచాక పార్టీలు మారే ప్రమాదముందని పేర్కొంది.

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ.. పార్టీల నీడలో అభ్యర్థులు ఉండడం వల్లే చట్టసభల సభ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. నేర చరిత్ర లేని వారికి పార్టీలు ఎందుకు టికెట్‌ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పిటిషనర్‌ వాదనపై అటార్నీ జనరల్‌ వెంకట రమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలో ఓటు వేయడానికి ముందుగానే ఓటర్లు తమ అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారని ఏజీ పేర్కొన్నారు. పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచన చేసింది. కోర్టు విచారణకు అంగీకరించని నేపథ్యంలో తాను ఈసీని ఆశ్రయిస్తాయని వికాస్‌ సింగ్‌ పేర్కొన్నారు. తమకు ఫిర్యాదు వస్తే తప్పకుండా పరిశీలిస్తామని ఈసీ తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారు.
చదవండి: ఎన్నికల వేళ.. బీజేపీలో ముసలం

మరిన్ని వార్తలు