Charanjit Singh Channi: మీటూ సెగ; తొలగించండి

20 Sep, 2021 16:43 IST|Sakshi

చండీగఢ్:  అనూహ్య పరిణామాల మధ్య పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా  చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేసింది. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా ఇంకా పూర్తి బాధ్యతలు చేపట్టకముందే ఛన్నీపై  గతంలో చెలరేగిన మీటూ వివాదాల సెగ తాకింది. మీటూ ఆరోపణలొచ్చిన  చన్నీని సీఎంగా ఎంపిక చేయడంపై జాతీయ మహిళా కమిషన్  ఛైర్‌పర్సన్  రేఖా శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హుడని, ఆయనను తొలగించాలని  సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. 

2018 లో చన్నీపై వచ్చిన మీటూ ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్  సుమోటోగా స్వీకరించిందని రేఖా శర్మ గుర్తు చేసుకున్నారు.  దీనిపై  ఆందోళన చేసినా   చర్యలేవీ లేకపోగా,  తాజాగా  అలాంటి వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడం శోచనీయమన్నారు. ఒక మహిళ (సోనియా గాంధీ) నేతృత్వంలోని పార్టీలో ఈ పరిణామం తీవ్ర ద్రోహమన్నారు. ఈ చర్య మహిళల భద్రతకు ముప్పు అని రేశాఖర్మ వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్రవిచారణ జరిపి, బాధిత మహిళ స్టేట్‌మెట్‌ను పరగణనలోకి తీసుకుని, చన్నీపై చర్యలు  తీసుకోవాలని ఆమె సోనియాను కోరారు. 

పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్‌మధ్య  మధ్య నెలరోజుల పాటు సాగిన సంక్షోభం నేపథ్యంలో కెప్టెన్‌ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు  సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఇసుక మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ గైర్హాజరు కావడం గమనార్హం.

కాగా 2018లో తనకు చరణ్‌జీత్ అసభ్య మెసేజ్‌లు పంపారంటూ  ఒక మహిళా ఐఏఎస్‌ ఆఫీసర్ ఆరోపణలు గుప్పించారు. అయితే తనపై ఆరోపణలు చేసిన అధికారిణికి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో  ముగిసినట్టు అంతా భావించారు.

మరిన్ని వార్తలు