‘దీక్షా’దక్షతకు సలాం

20 Nov, 2021 05:48 IST|Sakshi
హరియాణాలోని సోనీపట్‌ వద్ద రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ దృశ్యం(ఫైల్‌)

ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లోనే ఏడాదిగా రైతుల పోరాటం 

రహదారుల దిగ్బంధం, రైలు రోకోలు, ర్యాలీలతో సాగిన ఉద్యమం

అంతర్జాతీయంగానూ లభించిన మద్దతు

ఏడాదిలో 700 మందికిపైగా రైతులు బలి 

ఒకే డిమాండ్, ఒకే ఒక్క డిమాండ్‌   మూడు ‘నల్ల’ సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలనే   ఆ ఒక్క డిమాండ్‌ సాధన కోసం   రైతన్నలు ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం చేశారు లాఠీలు విరిగినా, కేసులు పెట్టినా, హింస చెలరేగినా   వాహనాలే యమపాశాలై ప్రాణాలు తీసినా అదరలేదు, బెదరలేదు, వెనకడుగు వెయ్యలేదు ఎండనక వాననక, గడ్డకట్టించే చలిని లెక్కచేయక కరోనా మహమ్మారికి బెదిరిపోక ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లోనే ఏడాదిగా మకాం వేసి చివరికి ఎలాగైతేనేం కేంద్రం మెడలు వంచారు.  

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన పోరాటం పంజాబ్‌లో మొదలై హరియాణాకి వ్యాపించి, ఉత్తరప్రదేశ్‌లో హింసకు దారి తీసి  దేశవ్యాప్తంగా అన్నదాతల్ని ఏకం చెయ్యడంతో కేంద్రం దిగొచ్చింది. కరోనాని లెక్కచేయకుండా, చలి ఎండ వాన వంటి వాతావరణ పరస్థితుల్ని తట్టుకొని, భార్యాపిల్లల్ని విడిచిపెట్టి, రోడ్లపైనే నిద్రించి మొక్కవోని దీక్షతో ఏడాది పాటు సుదీర్ఘంగా సాగిన ఉద్యమంలో రైతన్నలు చివరికి విజయం సాధించారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020 జూన్‌లో వ్యవసాయ చట్టాలను ఆర్డినెన్స్‌ రూపంలో తీసుకురావడంతో ఈ చట్టాలను దొడ్డదారిలో తెచ్చింది తమ పుట్టి ముంచడానికేనని  రైతన్నలు బలంగా నమ్మారు. కిసాన్‌ సంఘర్‌‡్ష సమన్వయ కమిటీ సెప్టెంబర్‌ 25న దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది. సెప్టెంబర్‌ 27న రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను ఆమోదించడంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్‌3 న వివిధ రైతు సంఘాలు చేసిన రైతు నిరసనలు మొదట్లో  పంజాబ్‌ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితమయ్యాయి.  నవంబర్‌ 25న రైతు సంఘాలు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి దానిపై పడింది. కేంద్ర ప్రభుత్వం పదకొండు రౌండ్లు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

ఏడాదిన్నర పాటు చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న కేంద్రం ప్రతిపాదనలకు కూడా రైతులు అంగీకరించలేదు. చట్టాల రద్దు తప్ప మరి దేనికీ తలవంచమంటూ పోరుబాట పట్టారు. ప్రతీ దశలోనూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతలా అణిచివేయాలని చూస్తే అంతలా పైపైకి లేచింది. ఒక్కో ఎదురుదెబ్బ తగిలినప్పుడలా మరింత బలం పుంజుకుంటూ వచ్చింది.

దేశవ్యాప్తంగా 40 సంఘాలకు చెందిన రైతులు ‘సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం)’ పేరిట ఒకే గొడుకు కిందకు వచ్చి ఢిల్లీ, హరియాణా, యూపీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌ వద్ద శిబిరాలు వేసుకొని అక్కడే మకాం వేశారు. కుటుంబాలను విడిచిపెట్టి వచ్చిన రైతులు సామూహిక వంటశాలలు, మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేసుకొని ఏడాదిగా అక్కడే ఉంటున్నారు. ‘కిసాన్‌ ఏక్తా జిందాబాద్‌’ అన్న నినాదం ఢిల్లీలో మారుమోగడమే కాదు, అదే ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది.  

ఎర్రకోట సాక్షిగా మలుపు తిరిగిన ఉద్యమం  
ఒకానొక దశలో సాగు చట్టాలపై రైతుల ఉద్యమం నీరుగారిపోతుందని అందరూ భావించారు.  ఈ ఏడాది జనవరి 26న గణతంత్రదినోత్సవం నాడు రైతు సంఘాల నాయకులు ఢిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింస, ఘర్షణలు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పాయి. కొంతమంది నిరసనకారులు ఎర్రకోట గోడలు మీదుగా ఎక్కి సిక్కు మతం చిహ్నమైన నిషాన్‌ సాహిబ్‌ జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలతో రాజధాని రణరంగంగా మారింది.

రైతు ఉద్యమం ఖలిస్తాన్‌ వేర్పాటువాద చేతుల్లోకి వెళ్లిపోయిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో రైతులు సరిహద్దులు ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ పెట్టుకున్న కన్నీళ్లు మళ్లీ ఉద్యమ నిప్పుకణికని రాజేసాయి. ఇంటి బాట పట్టిన నిరసనకారులందరూ తిరిగి ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేశారు. ఏడాదిగా జరుగుతున్న ఈ పోరాటంలో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతో  700 మందికి పైగా రైతులు మరణించారు. మరెందరో రైతులపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. 

యూపీకి వ్యాపించి, రణరంగంగా మారి: ఆ తర్వాత నుంచి రైతు సంఘం నాయకులు పక్కా ప్రణాళికతో రహదారులు దిగ్బంధించడం, రైలు రోకోలు,  నిరసన ర్యాలీలు, బ్లాక్‌ డే వంటివి  చేస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాకేశ్‌ తికాయత్‌ ర్యాలీలు చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రైతు ఉద్యమం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ  పాప్‌ స్టార్‌ రిహన్నా దీనిపై మనం ఎందుకు మాట్లాడడం లేదు అంటూ లేవనెత్తిన ప్రశ్నతో అంతర్జాతీయంగా అన్నదాతలకు మద్దతు లభించింది. 

టీనేజీ పర్యావరణవేత్త గ్రేటా థెన్‌బర్గ్‌ , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ మేనకోడలు లాయర్‌ అయిన మీనా హ్యారిస్‌ వంటివారు రైతుల గళానికి బలంగా నిలిచారు.మే 27న రైతు ఉద్యమానికి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బ్లాక్‌ డే పాటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో 200 మందికిపైగా రైతులు జంతర్‌మందర్‌ దగ్గర కిసాన్‌ సంసాద్‌ నిర్వహించారు. సెప్టెంబర్‌5న యూపీలోని ముజఫర్‌నగర్‌లో రైతు సంఘం నాయకులు బలప్రదర్శన చేశారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదీ తమ బలం అంటూ చూపించారు. ఇక యూపీలోని లఖీమ్‌పూర్‌ఖేరిలో అక్టోబర్‌ 3న జరిగిన హింసాత్మక ఘటనలతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకి వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతన్నలపై ఎస్‌యూవీ దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు బలి కావడం , ఆ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఉన్నారన్న ఆరోపణలు మోదీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి.

ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో రైతులపై ప్రజల్లో సానుభూతి పెల్లుబుకింది. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ, పంజాబ్‌ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతు ఉద్యమం అంతకంతకూ బలం పుంజుకుంటూ ఉండడంతో కేంద్రం వెనక్కి తగ్గింది.  వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఏడాది పాటు జరిగిన జరిగిన ఉద్యమం విజయతీరాలకు చేరుకుంది.     

సుప్రీం నిలిపివేసినా... ఉద్యమం ఆగలేదు!
వ్యవసాయ చట్టాలపై ఒకవైపు రైతులు వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు డిసెంబర్‌ 11న  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి విచారించడానికి ఈ ఏడాది జనవరి 7న సుప్రీం కోర్టు అంగీకరించింది.

వ్యవసాయ చట్టాలపై నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక కమిటీ వేయడానికి జనవరి 11న అంగీకరించింది. ఆ మర్నాడు జనవరి 12న వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ నిపుణులు అనిల్‌ ఘన్‌వత్, అశోక్‌ గులాటీ, ప్రమోద్‌ జోషిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికని మార్చి 19న సుప్రీంకోర్టుకి సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దాని ప్రక్రియను పూర్తి చేస్తే ఇక న్యాయస్థానంలో కేసే ఉండదు. ఆ పిటిషన్లన్నీ ప్రయోజనం లేకుండా మిగిలిపోతాయి.  

– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు