Repeal of farm laws:చారిత్రక విజయం, ఆందోళన కొనసాగుతుంది

19 Nov, 2021 12:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌. వివాదాస్పద మూడు సాగు చట్టాలపై బీజేపీ సర్కార్‌ నిర్ణయాన్ని  ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి. ఇది అన్న దాతల త్యాగాల ఫలితమని, చార్రితక విజయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు  గురునానక్ జయంతి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటనపై సంయుక్త కిసాన్ మోర్చా స్వాగతించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు రైతుల పోరాటంలో తీవ్రవాదులు, టెర్రరిస్టులు ప్రవేశించారనీ, దేశ ద్రోహులు, ఖలిస్తానీలు అంటూ రైతు ఆందోళనకారులపై విరుచుకుపడిన వారందరూ బహిరంగ  క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు..

జూన్ 2020లో ఆర్డినెన్స్‌లుగా తీసుకొచ్చిన మూడు రైతు-వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల నల్లజాతీయుల చట్టాలను రద్దు చేయడంపై  రైతు సంఘాలు సంతోషం  వ్యక్తం చేశారు.అయితే  పార్లమెంటులో ఈ చట్టాలు రద్దు అయేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని  రైతు నేత రాకేష్  తికాయత్‌ తెలిపారు. 

పార్లమెంటరీ విధానాల ద్వారా ప్రకటన అమల్లోకి వచ్చే వరకు వేచి ఉంటామని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. చట్టాల రద్దు నిర్ణయం అమలైతే  దేశంలో  దాదాపు ఒక సంవత్సరం పాటు సాగిన రైతుల పోరాటానికి ఇది చారిత్రాత్మక విజయం అవుతుందని పేర్కొంది.  కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి కారణంగానే లఖింపూర్ ఖేరీ హత్యలతోసహా ఈ పోరాటంలో దాదాపు 700 మంది రైతులు అమరులయ్యారని విమర్శించింది.  మూడు నల్ల చట్టాల రద్దు కోసమే  మాత్రమే కాకుండా, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులందరికీ లాభదాయక ధరల కోసం చట్టబద్ధమైన హామీ వచ్చేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపింది. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణతోపాటు రైతుల ఈ ముఖ్యమైన  డిమాండ్ ఇంకా పెండింగ్‌లోనే ఉందని వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు