గణతంత్ర వేళ అటు సంబరాలు.. ఇటు నిరసనలు

26 Jan, 2021 11:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా చేసుకునే సంబరాలే గణతంత్ర వేడుకలు. ఒకపక్కన దేశమంతటా 72వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు మంగళవారం నేత్రపర్వంగా సాగుతుంటే.. మరోవైపు రైతులు జాతీయ జెండాలు పట్టుకుని నిరసన బాట పట్టారు. నాగలితో పాటు జాతీయ జెండా చేత పట్టి ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ పరిసర ప్రాంతాల్లో గణతంత్ర వేడుకలు జరుగుతుండగా... అదే ఢిల్లీ శివారులో లక్షలాది మంది రైతులు వేలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ విధంగా జాతీయ పండుగ రోజు ఒకవైపు సంబరాలు.. మరోవైపు నిరసనలు కొనసాగడం విశేషం.

రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనగా.. కొన్ని కిలోమీటర్ల దూరంలోనే రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిరసన చేపడుతున్నారు. వారు నిర్విరామంగా 62 రోజులుగా పోరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి తమ వాణి వినిపిస్తున్నా మెట్టు దిగకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో గణతంత్ర వేడుకను తమ ఉద్యమానికి వినియోగించుకుని దేశభక్తిని చాటుతూనే నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇది ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. రాష్ట్రాల్లో కూడా రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు.

అయితే రైతుల భారీ ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాదాపు 10 విడతలు చర్చలు చేసినా ఎలాంటి ఫలితం లేదు. చర్చలకు పిలుస్తారు.. రైతులకు అడిగిన వాటికి కుదరదని తేల్చి చెప్పేస్తారు. దీంతో పదిమార్లు విడతలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఈ విషయంలో రైతులు ఒక్క మెట్టు కూడా దిగడం లేదు. వ్యవసాయ చట్టాల రద్దు తప్ప తమకు ఇంకోటి అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో చివరకు కేంద్రం ఒక మెట్టు దిగి సుప్రీంకోర్టు సలహా ప్రకారం ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాల రద్దును వాయిదా వేస్తామని ప్రకటించింది. దానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పగా రైతులు అంగీకరించలేదు. తాత్కాలికంగా తమ ఉద్యమాన్ని ఆపేందుకు కేంద్రం ఈ ప్రతిపాదన చేసిందని.. తక్షణమే ఆ చట్టాలను రద్దు చేస్తేనే కానీ తాము ఆందోళనలు విరమించమని తేల్చి చెబుతున్నారు. 

రైతుల పోరాటాన్ని స్వాతంత్ర్య పోరాటంగా కొందరు అభివర్ణిస్తున్నారు. రైతుల పోరాటంలో గణతంత్ర దినోత్సవం రోజుకు తీవ్ర రూపం దాల్చింది. మునుపెన్నడూ లేనివిధంగా పెద్దసంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దుల్లో మొహరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు