గణతంత్ర వేడుకల్లో రఫేల్‌ జిగేల్‌

24 Jan, 2021 09:14 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ గణతంత్ర దినోత్సవ వేడుకలు కరోనా ఆంక్షల మధ్య జరగనున్నాయి. ఈ నెల 26న దేశ సైనిక సత్తా చాటడానికి త్రివిధ బలగాలు సిద్ధమయ్యాయి. అయితే కోవిడ్‌–19 కారణంగా భారీగా మార్పులు చేర్పులు చేశారు. ప్రజా సందర్శనకి ఆంక్షలతో పాటు  ఎన్నో కొత్త శకటాలు ఈ ఏడాది దర్శనమివ్వనున్నాయి. 

  • రఫేల్‌ యుద్ధ విమానాలను తొలిసారిగా ఈ ఏడాది పెరేడ్‌లో ప్రదర్శించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన రఫేల్‌ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. 
  • మొట్టమొదటిసారిగా మహిళా యుద్ధ పైలెట్‌ లెఫ్ట్‌నెంట్‌ భావనాకాంత్‌ ఈ సారి ప్రదర్శనలో పాల్గొంటారు. భారత వాయుసేనకు చెంది తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్‌–30 విమాన శకటాలను భావన ముందుండి నడిపిస్తారు. 
  • గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా లద్దాఖ్‌ ప్రాతినిధ్యం వహించబోతోంది. లేహ్‌ జిల్లాలో చారిత్రక థిక్సే మఠాన్ని ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. థిక్సే కొండలపై ఉన్న ఈ మఠం ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. 
  • ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం తొలిసారిగా శకటంగా దర్శనమివ్వబోతోంది.
  • భారత నావికాదళం ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ 1971 భారత్‌–పాక్‌ యుద్ధ సమయంలో నావికా దళ ఆపరేషన్‌ను శకటంగా ప్రదర్శిస్తోంది. 
  • ఇక వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతులు భారీ ర్యాలీకి సిద్ధం కావడంతో ఎలాంటి పరిణామలు ఎదురు కాబోతాయా అన్న ఆందోళనైతే నెలకొంది.

కరోనా ఆంక్షల ప్రభావం

  • కోవిడ్‌–19 ఆంక్షల ప్రభావంతో ఈ సారి ముఖ్య అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తొలుత రావడానికి అంగీకరించినప్పటికీ కరోనా విజృంభణతో పర్యటన వాయిదా వేసుకున్నారు. దీంతో అయిదు దశాబ్దాల తర్వాత ముఖ్య అతిథి లేకుండానే వేడుకలు జరగనున్నాయి. గతంలో 1952, 1953, 1966లలో ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరిగాయి
  • కరోనా కారణంగా సందర్శకుల సంఖ్యని బాగా తగ్గించారు. గత ఏడాది లక్షా 50 వేల మందికి అనుమతినిస్తే ఈ సారి 25 వేల మంది హాజరుకానున్నారు. ఇక మీడియా సిబ్బంది సంఖ్య 300 నుంచి 200కి తగ్గించారు. 
  • ఈ సారి పాఠశాల విద్యార్థులు పెరేడ్‌లో ఉండరు. ఇక 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిని ఇండియా గేట్‌ లాన్స్‌లోకి మాత్రమే అనుమతినిస్తారు. 
  • పెరేడ్‌ సమయాన్ని కూడా తగ్గించారు. ఇండియా గేట్‌ దగ్గర నేషనల్‌ స్టేడియం వరకు మాత్రమే పెరేడ్‌కు అనుమతినిచ్చారు. ఇక శకటాలు మాత్రం ఎర్రకోట వరకు వెళతాయి
  • మాజీ సైనికాధికారులు, మహిళా అధికారులు పాల్గొనే కార్యక్రమాలను రద్దు చేశారు. సిఆర్‌పీఎఫ్‌ సిబ్బంది నిర్వహించే మోటార్‌ సైకిల్‌ స్టంట్స్‌ కూడా ఈ సారి ఉండవు.
  • శనివారం రాజ్‌పథ్‌లో ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్‌లో భారత యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామగ్రి
మరిన్ని వార్తలు