గుడ్‌న్యూస్‌: తట్టు వ్యాక్సిన్‌తో చిన్నపిల్లలకు కరోనా ముప్పు తప్పినట్లే!

23 Jun, 2021 17:03 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ చిన్నపిల్లలపై అధిక ప్రభావం చూపనుందని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో పుణెలోని బీజే మెడిక‌ల్ కాలేజీ పరిశోధకులు ఒక గుడ్‌న్యూస్‌ చెప్పారు. త‌ట్టు (మీజిల్స్‌) రాకుండా ఉండ‌టం కోసం పిల్ల‌ల‌కు వేసే వ్యాక్సిన్ వ‌ల్ల కొవిడ్ నుంచి కూడా ర‌క్ష‌ణ ల‌భిస్తున్న‌ట్లు వీరి ప‌రిశోధ‌న‌లో తేలింది. ఒక‌వేళ ఈ వ్యాక్సిన్ వేసుకున్న పిల్ల‌ల‌కు కొవిడ్ సోకినా.. దాని ప్ర‌భావం చాలా త‌క్కువ‌గా ఉంటున్న‌ట్లు కూడా స్ప‌ష్ట‌మైంది. క‌రోనా వైర‌స్‌పై మీజిల్స్ వ్యాక్సిన్ 87.5 శాతం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు వీరి అధ్య‌య‌నంలో తేలింది.

హ్యూమ‌న్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునోథెర‌ప్యూటిక్స్ జ‌ర్న‌ల్‌లో ఈ కథనాన్ని ప్ర‌చురించారు. పిల్ల‌ల్లో మీజిల్స్ వ్యాక్సిన్ కొవిడ్ నుంచి దీర్ఘ‌కాల ర‌క్ష‌ణ కూడా అందిస్తున్న‌ట్లు ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.  మీజిల్స్ వ్యాక్సిన్ కారణంగా పిల్లలకు కరోనా నుంచి రక్షణ లభిస్తుండడం నిజమే అయినా దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. ఇలాంటి అధ్యయనం చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ నీలేశ్ గుజార్ తెలిపారు.

మీజిల్స్ డోసు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, తొలి డోసు తీసుకున్న వారు తప్పనిసరిగా రెండో డోసు వేయించుకోవాలని డాక్టర్ నీలేశ్ సూచించారు. కాగా, ఈ అధ్యయనంలో భాగంగా 17 ఏళ్ల వయసున్న 548 మందిని రెండు గ్రూపులుగా విభజించి ఏడాదిపాటు పరిశోధనలు నిర్వహించారు. మీజిల్స్, బీసీజీ వ్యాక్సిన్లు కరోనా నుంచి పిల్లలకు రక్షణ కల్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్న వేళ తాజా అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది.

చదవండి: కరోనా: ‘టీకా వేసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం’

మరిన్ని వార్తలు