నివర్‌ తుపాన్‌: వంతెనలపై వాహనాల పార్కింగ్‌

26 Nov, 2020 09:29 IST|Sakshi

చెన్నై: తీవ్రమైన నివర్‌ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో తీరప్రాంత వాసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరదలో తమ వాహనాలు కొట్టుకుపోకుండా ఎత్తైనా ప్రాంతాలకు చేరుస్తున్నారు. 2015లో వచ్చిన వరదలకు చాలా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి, భారీ సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. మళ్లీ అలాంటి నష్టం జరగకుండా తమిళనాడులోని మడిపక్కం నివాసితులు తమ వాహనాలను వెలాచేరి సమీపంలోని మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న వంతెనపై నిలిపారు. యజమానులు తమ కార్లను ఒకదాని తరువాత ఒకటి పార్కింగ్ చేశారు. దీంతో వంతెన ఓవర్‌పాస్‌ ఇరువైపులా కార్లతో నిండిపోయింది. ఇది మునుపెన్నడూ చూడని దృశ్యమని స్థానికులు చెబుతున్నారు.

కాగా 2015లో వచ్చిన వరదలకు మడిపక్కం, కొట్టూర్పురం ప్రాంతాల్లోని అనేక కార్లు మునిగిపోయి చాలా వరకు దెబ్బతిన్నాయి. అదే సమయంలో నగరంలోని మొత్తం 22 సబ్‌వేలు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీటిని హెవీ డ్యూటీ మోటార్ల ద్వారా తొలగించారు. సుమారు 52 ప్రదేశాలలో కూలిన చెట్లను తొలగించామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తెలిపింది. నిరాశ్రయులతోపాటు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 1,200 మందికి పైగా సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వసతి కల్పించినట్లు జీసీసీ తెలిపింది.

ప్రస్తుతం నగరంతోపాటు శివారు ప్రాంతాలలో పగటిపూట భారీ వర్షాలు కురుస్తు​న్నాయి. తుపాను నైరుతి బంగాళఖాతం మీదుగా పశ్చిమ ఉత్తరం వైపుకు వెళ్తూ.. చాలా తీవ్రమైన తుఫానుగా మారి.. చెన్నై వైపు దూసుకొస్తుంది. నగరానికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉందని, గురువారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 

మరిన్ని వార్తలు