ప్రతి రెండు సెకన్లకు ఒక మరణం..

12 Nov, 2022 02:38 IST|Sakshi

అంటువ్యాధులు కాదు.. అంతం చేస్తున్న జీవనశైలి వ్యాధులు

ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న శ్వాసకోశ, గుండెపోటు, మధుమేహం, కేన్సర్‌ బాధితులు

2030 నాటికి ఏటా ఈ మరణాలు 5.5 కోట్లకు చేరే అవకాశం

ప్రస్తుతం భారత్‌లోనే ఏటా సుమారు 60 లక్షల మంది మృతి

మొత్తం మరణాల్లో 74% ఈ కోవలోనివే..

సరైన జాగ్రత్తలు పాటిస్తే వీటిని నియంత్రించవచ్చంటున్న నిపుణులు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్లేగు.. మలేరియా.. మశూచి వంటివి ఒకప్పుడు లక్షల ప్రాణాలు బలితీసుకున్నాయి. అవి ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకే లక్షణమున్న అంటు వ్యాధులు కావడం.. టీకాలు, మందుల్లాంటివి లేకపోవడమే దానికి కారణం. తర్వాత టీకాలొచ్చాయి.. మందులూ అందుబాటులోకి వచ్చాయి. అంటువ్యాధులతో ప్రాణాలు కోల్పోవడం తగ్గింది. కానీ మనిషిని మరో ప్రమాదం చుట్టుముడుతోంది. అది కొత్త ముప్పేమీ కాదు.. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన లేమి, జీవనశైలి మార్పుల పుణ్యమా అని విజృంభిస్తున్న అసాంక్రమిక వ్యాధులు.. గుండెపోటు, మధుమేహం, కేన్సర్లు, శ్వాసకోశ సమస్యలే అవి. ఇప్పుడివే సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి.

వ్యాధుల నివారణకు చర్యలు అవసరం
►అసాంక్రమిక వ్యాధులు పెచ్చరిల్లేందుకు ప్రధాన కారణం ఆహార అలవాట్లు. వాటి నియంత్రణతోపాటు వ్యాయా మం, దురలవాట్లకు దూరంగా ఉండటం అవసరం. ప్రభుత్వాలు కాలుష్య రహిత నగరాలను ప్రోత్సహించాలి. అందరికీ ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని.. అసాంక్రమిక వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బాధితుల్లో సగమందికిపైగా తమకు రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నట్టు తెలియడం లేదని ఇటీవలి అధ్యయనం ఒకటి చెబుతోంది. ప్రజల్లో అరోగ్యంపై ఉన్న అవగాహనకు ఇదో మచ్చుతునక. అసాంక్రమిత వ్యాధులను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే మరణాలు తగ్గించవ చ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జీవి తంలో మంచి ఉత్పాదక స్థితిలో ఉన్న ముప్ఫై ఏళ్లవారి నుంచి 70ఏళ్లవారి వరకూ అసాంక్రమిక వ్యాధుల బారిన పడకుండా చూసుకోవడం కష్టమేమీ కాదు.

పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించడం ద్వారా ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా వారు తమ కుటుంబాలను సొంతంగా పోషించుకోగలరు. సామాజిక ఉత్పా దకతకూ భంగం ఏర్పడదు. అసాంక్రమిక వ్యాధుల బారినపడి చికిత్స, పోషణ తాలూకూ ఖర్చులు ప్రభు త్వంపై పడటం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకు వస్తే.. ప్రధానమైన ఈ 4అసాంక్రమిత వ్యాధుల నుంచి వారిని కాపాడవచ్చు.

భారత్‌లో పరిస్థితి ఇదీ..
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. భారత్‌లో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో అసాంక్రమిత వ్యాధుల వల్లే 60.46 లక్షల మరణాలు (66 శాతం) నమోదవుతున్నాయి. ఇందులో గుండె సంబంధిత వ్యాధులతో 25.66 లక్షలు (28%), తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో 11.46 లక్షల (12%) మంది మరణిస్తు న్నారు. ఇక కేన్సర్‌తో 9.20 లక్షల మంది, మధుమేహంతో 3.46 లక్షల మంది మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రపంచంలో పరిస్థితి ఇదీ..
ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల్లో 74 శాతం అసాంక్రమిక వ్యాధులతో సంభవిస్తున్నవే. ఏటా వీటితో దాదాపు 4.1 కోట్ల మంది మరణిస్తున్నారు. గుండె జబ్బులతో మరణాలు 1.80 కోట్లు, కేన్సర్‌తో 93 లక్షలు, శ్వాస సంబంధ వ్యాధులతో 41 లక్షలు, మధుమేహంతో 20 లక్షల మరణాలు ఉంటున్నాయి. అంటే అసాంక్రమిక వ్యాధుల మరణాల్లో 80 శాతం ఈ నాలుగు రకాల వ్యాధులే ఉండటం గమనార్హం. ఈ మరణాల్లో పొగాకు వినియోగం వల్ల 80 లక్షలు, ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల 18 లక్షలు, ఆల్కాహాల్‌తో (కేన్సర్‌ కలిపి) 30 లక్షలు, సరైన శారీరక శ్రమ చేయకపోవడం వల్ల 8.3 లక్షల మరణాలు సంభవిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

►మీకు తెలుసా.. మీరు ఈ రెండు పదాలు చదివేలోపు భూమ్మీద ఓ ప్రాణం అసాంక్రమిక వ్యాధుల కారణంగా గాల్లో కలిసిపోయి ఉంటుంది. అవును.. ఇది నిజం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం అసాంక్రమిక వ్యాధుల కారణంగా ఏటా 4.1 కోట్ల మంది మరణిస్తున్నారు. ఓపికగా లెక్కేస్తే.. ఇది రెండు సెకన్లకు ఒక్కరని స్పష్టమవుతుంది. ప్రపంచం మాటిలా ఉంటే.. ఇప్పటికే గుండెజబ్బులు, మధుమేహానికి రాజధానిగా మారిన భారత్‌లోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు.

అసాంక్రమిక వ్యాధుల కారణంగా ఇక్కడ ఏటా సుమారు అరవై లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిజానికి అసాంక్రమిక వ్యాధులతో ఇన్ని విలువైన ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరమే లేదు. ఈ వ్యాధులు ఒక రకంగా మనం కోరి తెచ్చుకున్నవే. ప్రజల్లో ఆరోగ్యంపట్ల ఏ కొంచెం అవగాహన పెరిగినా కొన్ని లక్షల ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రభుత్వాలు ఆరోగ్యంగా జీవించేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తే, ప్రోత్సహిస్తే.. తగిన విధానాలను రూపొందిస్తే ఆగే అకాల మరణాల సంఖ్య కోట్లలో ఉంటుంది.

ఈ సంఖ్యలేవీ గాల్లోంచి పుట్టుకొచ్చినవి కావు. సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలేసి చెప్పినవే! అసాంక్రమిక వ్యాధుల మరణాల్లో అల్ప, మధ్యాదాయ వర్గాల వాటా దాదాపు 86 శాతం. అంటే తగిన వైద్య సదుపాయాల్లేని పరిస్థితుల్లో పేదలే ఎక్కువగా బలవుతున్నారన్నమాట. ప్రపంచ సగటు ఆయుర్ధాయం 2022లో 72.98 ఏళ్లుకాగా.. అల్ప, మధ్యాదాయ దేశాల్లో బాగా తక్కువగా ఉండటం గమనార్హం.

మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే..
అసాంక్రమిత వ్యాధులను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నియంత్రించవచ్చు. ప్రధానంగా షుగర్, బీపీ, శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, కేన్సర్‌ వంటివి రాకుండా చూసుకునే వీలుంది. ఆహారం, రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారా నియంత్రించుకోవచ్చు. అల వాట్లు, ఆహారం, ధూమపానం, మద్యం వంటి వాటివల్ల ఇలాంటి వ్యాధులు వస్తాయి. తల్లిదండ్రులకు షుగర్, థైరాయిడ్‌ ఉండటం వల్ల తమకు వచ్చిందని చాలామంది చెబుతుంటారు.

అది పూర్తి వాస్తవం కాదు. అలా రాకుండా జాగ్రత్త పడొచ్చు. కేన్సర్‌ కూడా అంతే. ఆహార అలవాట్లు, నిల్వ ఉంచిన, ప్యాకేజీ ఆహార పదా ర్థాలను తినడం వల్ల వచ్చే అవకాశ ముంది. చాలామంది ఇంట్లో తయారు చేసుకోకుండా రెడీమేడ్‌ ఆహారాలను తింటున్నారు. ఇది కేన్సర్‌కు ఒక కార ణం. మద్యం కూడా ఒక కారణం. కలుషిత గాలి వల్ల శ్వాసకోశ సమస్యలు, కేన్సర్లు వస్తాయి. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి వ్యాధులు రాకుండా చూసు కోవచ్చు.    
– డాక్టర్‌ సాయి ప్రత్యూష, ఆస్పిన్‌ హెల్త్‌ క్లినిక్, హైదరాబాద్‌

పొగాకు, మద్యం మానేయాలి.. సమయానికి నిద్ర ఉండాలి
పొగాకు, మద్యం వాడకం తగ్గించాలి. దీని పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఏదైనా వ్యాధి బారినపడిన వారు ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే కొంత వరకు కాపాడవచ్చు. బయటి ఫుడ్‌ తగ్గించాలి. ఎక్కువగా నడవాలి. ఆలస్యంగా నిద్ర పోవడం, తిన్న వెంటనే పడుకోవడం కూడా మంచిది కాదు. ఎక్కువ బరువు ఉండటం కూడా ఇబ్బందికరమే. షుగర్, కొలెస్ట్రాల్‌ ఉన్నవారు ముందు జాగ్రత్తగా చికిత్స తీసుకో వాలి. మందులు సక్రమంగా వాడా లి. ఇవన్నీ ఎవరికి వారే గుర్తించి అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్‌ తూడి పవన్‌రెడ్డి, జనరల్‌ ఫిజీషియన్, కిమ్స్, సన్‌షైన్‌ ఆస్పత్రి 

మరిన్ని వార్తలు