బలవంతంగా ఒప్పించారు: రియా

10 Sep, 2020 05:50 IST|Sakshi

బెయిల్‌ కోసం ప్రత్యేక కోర్టుకు

ముంబై: ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న రియాచక్రవర్తి తనకు జైల్లో ప్రాణభయం ఉన్నదనీ, తనపై మోపినవి బెయిలబుల్‌ నేరాలు కనుక తక్షణమే తనకు బెయిల్‌  మంజూరు చేయాల్సిందిగా ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. తాను అమాయకురాలిననీ, తనని తప్పుడు కేసులో ఇరికించారనీ రియా తన బెయిల్‌  పిటిషన్‌లో పేర్కొన్నారు. మంగళవారం మెజిస్ట్రేటు కోర్టు రియా బెయిల్‌ పిటిషన్‌ని తిరస్కరించడంతో రియా, ఆమె సోదరుడు షోవిక్‌లు నార్కొటిక్స్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డిపిఎస్‌) చట్టం కింద బెయిల్‌ కోసం ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు.

రియాని ప్రశ్నించింది పురుష అ«ధికారులేనని ఆమె న్యాయవాది సతీష్‌ మనే షిండే అన్నారు, ఆ సమయంలో కనీసం మహిళా పోలీసు అధికారి కానీ, కానిస్టేబుల్‌ కానీ లేకపోవడాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. నేరం అంగీకరించేలా రియాపై ఒత్తిడిచేశారని ఆమె లాయర్‌ ఆరోపించారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ల బెయిల్‌ పిటిషన్‌ గురువారం విచారణకు రానుందని షిండే తెలిపారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించిన డ్రగ్స్‌ కేసులో మంగళవారం స్థానిక కోర్టు ఆమెను సెప్టెంబర్‌ 22 వరకు జ్యూడీషియల్‌ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే.  నేరం రుజువైతే రియా, ఆమె సోదరుడు షోవిక్‌  పదిసంవత్సరాలకు తగ్గకుండా కారాగార శిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు