అతిచేస్తే ఇలాగే ఉంటది.. రైనో దెబ్బకు జీపుల్లో పరుగో పరుగు.. వీడియో వైరల్‌

31 Dec, 2022 15:30 IST|Sakshi

వన్యమృగాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా టూరిస్టులు.. నేషనల్‌ పార్కుల్లో పర్యటిస్తున్నప్పుడు జంతువులను రెచ్చగొడితే.. అవి ఆగ్రహంతో దూసుకువస్తాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

పర్యాటకులను ఓ ఖడ్గమృగం వెంబడించి.. వారికి చుక్కలు చూపింది. దీంతో, వారు పరుగో పరుగు అంటూ అక్కడి నుంచి జీపుల్లో తప్పించుకున్నారు. కాగా, ఈ ఘటన అసోంలోని కజిరంగా నేషనల్‌ పార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కొందరు టూరిస్టులు నేషనల్‌ పార్క్‌లో పర్యటిస్తున్నారు. కాగా, కజిరంగా పార్క్‌లో దాదాపు 2700లకు పైగా సంఖ్యలో రైనోలు ఉంటాయి. ఈ సందర్భంగా పర్యాటకులు రైనోతో అనుచితంగా ప్రవర్తించి దాన్ని రెచ్చగొట్టారు. దీంతో​, ఆగ్రహానికిలోనైనా రైనో.. వారి వెంబండించింది. 

ఈ క్రమంలో పర్యాటకులు జీపుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగో అంటూ పరుగుతీశారు. డ్రైవర్‌ ఎంతో చాకచక్యంగా జీపు నడపడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా టూరిస్టులు బయటపడ్డారు. దీంతో, అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు