రిక్షా కార్మికుడిని రూ.3 కోట్లు టాక్స్‌ కట్టాలన్న ఐటీ అధికారులు

26 Oct, 2021 09:52 IST|Sakshi

లక్నో: అతనో రిక్షా కార్మికుడు. తన బతుకు బండి నడవాలంటే రిక్షా నడపాల్సిందే. అలాంటి వ్యక్తికి ఆదాయపన్ను శాఖ (ఐటీ) రూ.3 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. రోజూ కష్టపడితే అతనికి వెయ్యి రూపాయలు కూడా వచ్చేది అనుమానమే అలాంటి వ్యక్తి అంత డబ్బు కట్టాలనేసరికి షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసుల ఫిర్యాదులో.. బ్యాంక్‌ అధికారులు పాన్‌ కార్డును అకౌంట్‌కు అనుసంధానించాలని చెప్పడంతో బకల్‌పూర్‌లోని జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని రోజుల తరువాత ఆ  షాపులోని వ్యక్తి తనకు పాన్‌కార్డు కలర్‌ కాపీని ఇచ్చాడని తెలిపాడు. అయితే తనకు అక్టోబర్ 19న ఐటీ అధికారుల నుంచి ఫోన్ వచ్చిందని, రూ. 3,47,54,896 చెల్లించాలని నోటీసు ఇచ్చారని చెప్పారు. దీంతో షాక్‌ అయిన ఆ వ్యక్తి తాను రిక్షా కార్మకుడని.. తన కథంతా ఐటీ అధికారులకి వివరించాడు.

దీంతో తన పేరుపై ఎవరో వ్యాపారాన్ని నడుపడంతో 2018-19లో వ్యాపారపరమైన టర్నోవర్ రూ.43,44,36,201 అని అధికారులు చెప్పడంతో అతనికి అసలు కథ అర్థమైంది. కాగా తాను నిరక్షరాస్యుడు కావడంతో ఒరిజినల్‌ పాన్‌ కార్డుకు, కలర్‌ కాపీకి తేడా గుర్తించలేకపోయినట్లు తన వెనుక జరిగిన మోసాన్ని అప్పుడే అధికారులకు వివరించాడు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఐటీ అధికారులకు అతనికి.. తన పాన్‌ కార్డుని కొందరు దుర్వినియోగం చేశారని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమని సలహా ఇచ్చారు.  దీంతో ప్రతాప్‌ సింగ్‌ మధుర పోలీసులో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు