‘సరిహద్దుల పహారాలో మగువల తెగువ’

4 Aug, 2020 18:22 IST|Sakshi

భద్రతా విధుల్లో మహిళా సైనికులు

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి భారత సైన్యం మంగళవారం తొలిసారిగా ‘రైఫిల్‌ విమెన్‌’ను దేశ భద్రత విధుల్లోకి దింపింది. ఎల్‌ఓసీ ప్రాంతంలో భద్రతా విధుల్లో మహిళలను మోహరించడం భారత సైన్యం చరిత్రలో ఇదే తొలిసారి. సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తులో సాధనా పాస్‌ ద్వారా ఎల్‌ఓసీ వైపు వెళ్లే రహదారిపై భద్రతా విధుల్లో మహిళా అధికారి నేతృత్వంలో ఆరుగురు రైఫిల్‌ విమెన్‌ను నియమించామని సైన్యం వెల్లడించింది. అస్సాం​ రైఫిల్స్‌కు చెందిన ఈ మహిళా సైనికులు భారత సైన్యంలో డిప్యుటేషన్‌పై చేరారని అధికార వర్గాలు తెలిపాయి. ఎల్‌ఓసీకి దగ్గరగా ఉన్న జాతీయ సరిహద్దుల్లో పహారా విధులను రైఫిల్‌ విమెన్‌కు అప్పగించినట్టు వెల్లడించాయి.

సాధనా పాస్‌ ద్వారా దేశంలోకి నార్కోటిక్స్‌, నకిలీ కరెన్సీ, ఆయుధాల స్మగ్లింగ్‌ను వీరు అడ్డుకుంటారు. ఈ ప్రాంతం పాక్‌ ఆక్రమిత కశ్మర్‌కు అత్యంత చేరువగా ఉండటంతో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌వైపు చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రాంతంలో 40 గ్రామాల ప్రజలు కశ్మీర్‌లోకి వెళ్లేందుకు సాధనా పాస్‌ మీదుగా వెళ్లాల్సిన క్రమంలో వీరిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంటారు. ఈ గ్రామాల నుంచి వచ్చే మహిళలు ఉన్న వాహనాలను తనిఖీ చేసేందుకు రైఫిల్‌ విమెన్‌ సేవలను భారత సైన్యం వినియోగించుకోనుంది. భారత సైన్యంలో మహిళలు శాశ్వత హోదాలో పనిచేయవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. చదవండి : చైనాకు దీటుగా బలగాల మోహరింపు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు