నేడు రిలే నిరాహార దీక్షలు 

21 Dec, 2020 02:01 IST|Sakshi

రైతు నేతల ప్రకటన

ఒకటి రెండు రోజుల్లో మళ్లీ చర్చలు జరుగుతాయన్న అమిత్‌ షా 

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అన్ని నిరసన కేంద్రాల వద్ద ఈ దీక్ష జరుగుతుందని ఆదివారం ప్రకటించారు. మూడు వారాలకు పైగా సాగుతున్న నిరసన దీక్షల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా రైతులు ఆదివారం ‘శ్రద్ధాంజలి దివస్‌’ను పాటించారు. రైతులతో ఒకటి, రెండు రోజుల్లో చర్చలు ప్రారంభమవుతాయని హోంమంత్రి అమిత్‌ షా సంకేతాలిచ్చారు.

వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రైతు నేతలతో చర్చలు పునః ప్రారంభిస్తారన్నారు. సింఘు సరిహద్దు వద్ద సోమవారం 11 మంది రైతులతో రిలే నిరాహార దీక్ష జరుగుతుందని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ తెలిపారు. హరియాణాలోని రహదారులపై ఈనెల 25 నుంచి 27 వరకు టోల్‌ ఫీజులను ఎవరూ చెల్లించకుండా అడ్డుకుంటామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత జగ్జీత్‌ సింగ్‌ దలేవాలా ప్రకటించారు. 27న ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగం ఇచ్చే సమయంలో అంతా పళ్లాలపై చప్పుడు చేస్తూ నిరసన తెలపాలని దేశ ప్రజలను కోరారు. 

‘ఫేస్‌బుక్‌’ను బ్లాక్‌ చేశారు 
రైతు ఆందోళనలను సోషల్‌ మీడియాలో ప్రజలకు వివరిస్తున్న ‘కిసాన్‌ ఏక్తా మోర్చా’ ఫేస్‌బుక్‌ పేజ్‌ని బ్లాక్‌ చేశారని రైతు నేతలు ఆరోపించారు. ఆదివారం రైతు నేతల విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారం సాగుతుండగానే పేజ్‌ను బ్లాక్‌ చేశారన్నారు. 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న తమ అధికారిక ఫేస్‌బుక్‌ పేజ్‌ను ఫేస్‌బుక్‌ సంస్థ తొలగించిందని కిసాన్‌ ఏక్తా మోర్చా తెలిపింది.

రైతులకు మళ్లీ ఆహ్వానం  
తదుపరి విడత చర్చలకు రావాలని కోరుతూ రైతు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం లేఖ రాసింది. ఏ తేదీన చర్చకు వస్తారో తెలియజేయాలంటూ వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ ఆ లేఖలో రైతు నేతలను కోరారు. 

25న రైతులతో సంభాషించనున్న మోదీ 
మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి రోజైన డిసెంబర్‌ 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సంభాషిస్తారని బీజేపీ తెలిపింది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు 2500 ప్రాంతాల్లో కిసాన్‌ సంవాద్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

సొంత పత్రిక 
ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు సొంతంగా ఒక పత్రికను ప్రచురించడం ప్రారంభించారు. రైతు ఉద్యమ వివరాలతో వారానికి రెండు సార్లు వచ్చే ఈ ‘ట్రాలీ టైమ్స్‌’ పత్రిక తొలి ప్రతిని శనివారం ప్రచురించారు. రైతు నేతల విలేకరుల సమావేశాల వివరాలు, ప్రభుత్వ తీరు, ఇతర రైతాంగ ఉద్యమ అంశాలను ప్రచురించనున్నామన్నారు. ఆందోళనలో పాల్గొంటున్న రైతులకు ఉద్యమానికి సంబంధించి తప్పుడు సమాచారం అందకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోషియార్‌ సింగ్‌ అనే రైతు తెలిపారు. 

మరిన్ని వార్తలు