ఉడుకుతున్న పప్పులు

17 Aug, 2022 05:07 IST|Sakshi

పప్పుధాన్యాలు అధికంగా సాగయ్యే రాష్ట్రాల్లో వర్షాలతో తీవ్ర నష్టం

తమిళనాడు, కేరళలో రూ.140కి చేరిన కిలో కందిపప్పు

వ్యాపారుల వద్ద నిల్వలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై రెండో వారం నుంచి పప్పుల ధరల్లో పెరుగుదల ఉంటుందన్న కేంద్రం అంచనాలకు అనుగుణంగానే ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళలో కిలో కందిపప్పు ధర రూ.135–140కి చేరగా, ప్రస్తుత వర్షాలతో జరిగిన పంట నష్టం కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీనిపై కేంద్రం అప్రమత్తమైంది.

వరదలతో పెరిగిన నష్టం..
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది పప్పుధాన్యాల సాగు తగ్గినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 1.27 కోట్ల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగు కాగా, ఈ ఏడాది అది 1.18 కోట్ల హెక్టార్లకు తగ్గింది. దేశంలో ఎక్కువగా సాగు చేసే కంది పంట విస్తీర్ణం గత ఏడాది 47 లక్షల హెక్టార్లుంటే అది ఈ ఏడాదికి 41 లక్షల హెక్టార్లకు తగ్గింది. అధికంగా సాగయిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర పంట నష్టం జరిగింది.

ఇలాంటి సమయాల్లో ఎక్కువగా మిల్లర్లు విదేశీ దిగుమతులపై ఆధారపడతారు. ముఖ్యంగా మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ సైతం వర్షాభావంతో సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. ఇదే అవకాశంగా తీసుకొని వ్యాపారులు పప్పుల ధరలను క్రమంగా పెంచుతున్నట్లు కేంద్రం గుర్తించింది. జూలై మొదటి వారంలో కందిపప్పు జాతీయ సగటు ధర కిలో రూ.100 ఉంటే అది ఇప్పుడు రూ.109కి చేరింది. మినప, పెసర, శనగ పప్పులు ధరలు సైతం ఏకంగా రూ.10 మేర పెరిగాయి.

కేంద్రం అంచనా వేసిన ధరల కన్నా రూ.10–15 మేర అధికంగా బహిరంగ మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుతం గ్రేడ్‌–1 రకం కందిపప్పు ధర కిలో రూ.135–140మధ్య ఉంది. ఇక్కడ ధరలు నెల రోజుల వ్యవధిలోనే రూ.20–25 వరకు పెరిగాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ధరలు రూ.100 నుంచి రూ.115 మధ్య ఉన్నాయి. ఢిల్లీలోనూ కిలో కందిపప్పు ధర రూ.120 ఉండగా, మినపపప్పు ధర రూ.125గా ఉంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పండగల సీజన్‌ మొదలయింది. ఆగస్టు మొదలు అక్టోబర్‌ వరకు పండగ సీజన్‌ నేపథ్యంలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టిస్తే ఈ ధరల పెరుగుదల మరింతగా ఉండవచ్చని కేంద్రం అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.  

గట్టి నిఘా ఉంచండి..
ధరల కట్టడిలో భాగంగా దేశీయ, విదేశీ మార్కెట్లలో పప్పుల లభ్యత, ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది.  పప్పుధాన్యాల స్టాక్‌ హోల్డర్లు నిల్వలను బహిర్గతం చేసేలా చూడాలని కోరింది. నిల్వల వివరాలను ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేసే వివరాలను సమీక్షించాలని తెలిపింది.

మరిన్ని వార్తలు