తొలి బస్‌ డ్రైవర్‌: ఆమె ప్రత్యేకత ఇదే..

5 Sep, 2021 16:35 IST|Sakshi

ఇండోర్‌: సాధారణంగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు రంగంలో పురుషులే అధికంగా కనిపిస్తారు. అయితే మారుతున్న సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో ప్రవేశిస్తూ దూసుకేళ్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే చేయగలరనే చాలా పనులను మహిళలు చేసి చూపుతున్నారు. వాహనాలు నడపటంలో కూడా మేము సైతం అంటున్నారు. తాజాగా రితూ నర్వాల్‌ అనే మహిళ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు.

అత్యంత రద్దీగా ఉండే బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(బీఆర్‌టీఎస్‌) కారిడార్‌లో గురువారం ఆమె తన మొదటి ట్రిప్‌ను రాజీవ్‌ గాంధీ స్క్వేర్ నుంచి నిరంజన్‌పూర్‌ స్క్వేర్ వరకు బస్‌ నడిపి ప్రయాణికులను తీసుకువచ్చింది. బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణించాలని ప్రోత్సహిస్తూ అటల్‌ ఇండోర్‌ సిటీ ట్రాన్స్‌పోర్టు సర్వీస్‌ లిమిటెడ్‌( ఏఐసీటీఎల్‌) కొత్తగా ‘పింక్‌ బస్‌’ సేవలను ప్రారంభించింది.

అందులో భాగంగానే ఇద్దరు మహిళలకు బస్‌ డ్రైవింగ్‌ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న నర్వాల్‌ గురువారం ట్రయల్‌ రన్‌లో తొలిసారి బస్‌ను సురక్షితంగా నడిపారు. ఏఐసీటీఎల్‌ ఇన్‌ఛార్జ్‌ సందీప్‌ సోని మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసిన ఇద్దరు మహిళ డైవర్లు సోమవారం నుంచి విధుల్లో చేరనున్నారని తెలిపారు. అన్ని పింక్‌ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు మహిళలే ఉంటారని పేర్కొన్నారు.

పింక్‌ బస్సులు కేవలం మహిళల కోసం కేటాయించామని, ఇప్పటికే మహిళా కండక్టర్లు ఉన్నారని మరి కొంతమంది మహిళా కండక్టర్ల, డ్రైవర్లను నియమిస్తామని చెప్పారు. అయితే బీఆర్‌టీఎస్‌ కారిడార్‌లో రోడ్డు చాలా క్లిష్టంగా ఉంటుందని, అందుకే మహిళా డ్రైవర్లకు ప్రత్యేక  శిక్షణ ఇచ్చామని తెలిపారు. 

నా కల నిజమైంది
‘నేను ఎప్పటికైనా హెవీ మోటర్‌ వెహికల్‌ డ్రైవర్‌ కావాలకున్నా. బస్‌ లేదా ట్రక్‌ ఏదైనా నడపాలని కల కన్నాను. ఇప్పుడు నా కల నిజమైంది. నేను 28ఏళ్ల వయస్సులో.. 2015లో ఓ స్కూల్‌ బస్‌ నడపడంతో డ్రైవింగ్‌ మొదలుపెట్టాను’ అని నర్వాల్‌  తెలిపారు. బస్సులోని ప్రతీ అక్కా, చెల్లెలి రక్షణ తన బాధ్యత అని పేర్కొన్నారు.

సొంత వాహనంతో డ్రైవింగ్‌ నేర్చుకున్నా
మరో మహిళా డ్రైవర్‌ అర్చనా కాటేరా గతంలో మూడేళ్లు ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు డ్రైవర్‌గా పనిచేశారు. ‘నా సొంత వాహనంతో డ్రైవింగ్‌ నేర్చుకున్నా. మూడే నెలల డ్రైవింగ్‌ శిక్షణ తర్వాత ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు డ్రైవర్‌గా మూడేళ్లపాటు పనిచేశాను. తర్వాత మరో హోటల్‌కి మారాను. కోవిడ్‌-19 ‍కారణంగా కుటుంబం కోసం ఆ ఉద్యోగం మానేశాను. ప్రస్తుతం నేను పింక్‌ డ్రైవర్‌గా నియమించబడ్డాను’ అని అర్చనా పేర్కొంది. 

మరిన్ని వార్తలు