చైనా చర్యలు.. ఆ నదిలో నీళ్లు నల్లగా మారాయి.. తీవ్ర ఇబ్బందుల్లో భారత ప్రజలు

1 Nov, 2021 12:01 IST|Sakshi

Kameng River Suddenly Turns Black సాధారణంగా నదులంటే మంచి నీటితో పరవళ్లు తొక్కుతూ జీవ రాశులతో కళకళలాడుతుంది. అలాంటిది అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవహిస్తున్న కామెంగ్‌ నది మాత్రం అకస్మాత్తుగా నల్లగా మారి కళ తప్పింది. దీనికి కారణం ఏదైనా, కారకులెవరైనా నదిలో వేలాది చేపలు కూడా చనిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మ‌రి ఈ న‌దిలోని నీరంతా విష‌మ‌యం కావ‌డానికి కార‌ణ‌మేంటో తెలుసా ! మ‌న పొరుగు దేశ‌మైన చైనానే అని నదికి సమీపంలో నివసిస్తున్న నివాసితులు ఆరోపిస్తున్నారు.  అసలేం జరిగిందంటే..

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సెప్పా వద్ద శుక్రవారం నదిలో వేల సంఖ్యలో చేపలు చనిపోయాయని జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి (డీఎఫ్‌డీవో) హాలి తాజో తెలిపారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం, మరణాలకు కారణం నదిలోని నీళ్లలో టీడీఎస్‌ అధిక శాతం ఉండడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. నది నీటిలో అధిక టీడీఎస్‌ ఉన్నందున, చేపలు ఆక్సిజన్‌ను పీల్చుకోవడం కష్టంగా మారుతుందని దీని కారణంగా అవి చనిపోయినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఆ నదిలో టీడీఎస్ లీటరుకు 6,800 మిల్లీగ్రాములుగా ఉంది.

సాధారణంగా అయితే నీటిలో ఒక లీటరుకు 300-1,200 మిల్లీగ్రాముల ఉంటుంది. తూర్పు కమెంగ్ జిల్లా యంత్రాంగం కామెంగ్ నదికి సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లవద్దని, చనిపోయిన చేపలను విక్రయించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. నదిలో టిడిఎస్ పెరగడానికి చైనా కారణమని సెప్పా ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రాగన్‌ దేశం చేస్తున్న భారీ నిర్మాణ కార్యకలాపాల వల్ల నీటి రంగు నల్లగా మారిందని ఆరోపించారు. కమెంగ్ నది నీటి రంగు ఆకస్మికంగా మారడం, పెద్ద మొత్తంలో చేపలు చనిపోవడం వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సెప్పా తూర్పు ఎమ్మెల్యే తపుక్ టాకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

చదవండి: కేంద్రం మరోషాక్‌ ! భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

మరిన్ని వార్తలు