‘ఇండియాలో పరిస్థితులు బాగాలేవు’.. బిహార్‌ మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

24 Dec, 2022 05:31 IST|Sakshi

విదేశాల్లోనే స్థిరపడాలని నా పిల్లలకు చెప్పా 

ఆర్జేడీ నేత సిద్దిఖీ వ్యాఖ్యలు, బీజేపీ ధ్వజం

పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) సీనియర్‌ నాయకుడు, బిహార్‌ మాజీ మంత్రి అబ్దుల్‌ బారీ సిద్దిఖీ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భారత్‌లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, విదేశాల్లోనే స్థిరపడాలని తన పిల్లలకు చెప్పానంటూ వారం క్రితం ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘నా కుమారుడు అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. కుమార్తె లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువు పూర్తిచేసింది.

అక్కడే ఉద్యోగాలు వెతుక్కోవాలని, సాధ్యమైతే అక్కడే స్థిరపడి, పౌరసత్వం కూడా సంపాదించుకోవాలని చెప్పాను. ఎందుకంటే భారత్‌లో పరిస్థితులు బాగాలేవు. వారు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటారో లేదో తెలియదు. ఒక తండ్రి తన పిల్లలకు ఇలాంటి మాటలు చెప్పాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోండి’’ అని సిద్దిఖీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ బిహార్‌ అధికార ప్రతినిధి నిఖిల్‌ ఆనంద్‌ ఖండించారు. సిద్దిఖీ లాంటి వ్యక్తులు జాతి వ్యతిరేక అజెండాను మోస్తున్నారని మండిపడ్డారు. దేశం పట్ల, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని సిద్దిఖీ కుటుంబంతో సహా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలన్నారు. ఈ దేశం ఎవరి జాగీరూ కాదంటూ దీనిపై సిద్దిఖీ ఆగ్రహం వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు