‘జంపింగ్‌’ బాబులు జడుసుకునే వార్త

27 May, 2022 19:53 IST|Sakshi

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర పెరిగిన ప్రమాదాలు, మరణాలు

79 శాతం పెరిగిన రెడ్‌లైట్ జంపింగ్ డెత్స్‌

కేంద్ర ప్రభుత్వ నివేదికలో వివరాలు వెల్లడి

న్యూఢిల్లీ: రహదారులపై ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా సిగ్నల్‌ జంప్‌ చేసే వాహనదారులు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జంపింగ్‌ బాబులు జడుసుకునే వార్త కేంద్రం తాజాగా వెల్లడించింది. రెడ్‌లైట్ జంపింగ్ కారణంగా రోడ్డు ప్రమాద మరణాలు 2019తో పోలిస్తే 2020లో 79 శాతం పెరిగాయని తాజా నివేదికలో పేర్కొంది. 'భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు - 2020' నివేదికను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. 

ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ వల్ల 2020లో 919 ప్రమాదాలు సంభవించగా.. 476 మంది మృతి చెందారు. 2019లో 266 మంది దుర్మరణం పాలయ్యారు. రాంగ్ రూట్‌ డ్రైవింగ్‌ కారణంగా 2020లో 3,099 మంది ప్రాణాలు కోల్పోగా.. 2019లో 2,726 మంది మృత్యువాత పడ్డారు. మద్యం మత్తులో ప్రమాదాలకు గురై 2020లో 1862 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో 2376 మరణాలు నమోదయ్యాయి. 


మితిమీరిన వేగమే అత్యధిక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. 2020 క్యాలెండర్ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 3,66,138 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 1,31,714 మంది మరణించగా.. 3,48,279 మంది క్షతగాత్రులయ్యారు. అయితే 2019తో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 18 శాతం, మరణాల రేటు 12.8 శాతం తగ్గింది. రోడ్డు ప్రమాద బాధితుల్లో 18-45 ఏళ్ల వయస్సు గల యువకులే 69 శాతం మంది ఉండగా.. మొత్తం మరణాల్లో 18 నుంచి 60 ఏళ్లలోపు వర్కింగ్ వయసులో ఉన్నవారు 87.4 శాతం మంది ఉండడం ఆందోళన కలిగించే అంశం. 


అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడానికి కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణమని నివేదిక వెల్లడించింది. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, కొత్త మోటారు వాహన చట్టం అమలు చేయడం వల్ల కూడా దుర్ఘటనలు తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనదేశంలో 11 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రహదారి దుర్ఘటనల్లో మరణించిన ప్రతి 10 మందిలో ఒకరు మనదేశానికి చెందినవారు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. (క్లిక్‌: బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం)


2018లో స్వల్పంగా(0.46 శాతం) పెరగడం మినహా 2016 నుంచి రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయం. వరుసగా రెండో ఏడాది ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడం కొంతలో కొంత ఊరట. అదేవిధంగా, గాయపడిన వారి సంఖ్య కూడా 2015 నుండి తగ్గుతూ వస్తోంది. (క్లిక్‌: లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్లు మృతి)

మరిన్ని వార్తలు