ఒకే చోట వరుస ప్రమాదాలు.. ప్రాణాలు తీస్తున్న బ్లాక్‌స్పాట్

2 Jun, 2022 14:39 IST|Sakshi

ఒకేచోట 20 మీటర్ల దూరంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్‌లు అంటారు. బరంపురం నగరం నుంచి దిగపండి మీదుగా కొందమాల్, రాయగడ వెళ్లే 326 నంబర్‌ జాతీయ రహదారిలో తప్తపాణి–కళింగా మధ్య ఘాట్‌ రోడ్‌ బ్లాక్‌ స్పాట్‌గా మారింది. గత కొద్ది రోజులుగా ఇక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతుండడం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ఏడాదిలో కాలంలో ఇక్కడ జరిగిన దుర్ఘటనల్లో సుమారు 20 మందికి పైగా మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలు పాలై అస్పత్రిలో చికిత్స పొందగా, వారిలో పదుల సంఖ్యలో వికలాంగులుగా మారారు. అందువలన ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.          

ఏ పిక్నిక్‌కు వెళ్లి వస్తుండగా... 
జనవరి 15వ తేదీన రాయగడా జిల్లా చంద్రగిరికి పిక్నిక్‌కు వెళ్లి రాత్రి 10 గంటల సమయంలో తిరిగి వస్తున్న బస్సు తప్పపాణి ఘాటి దగ్గర ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాద సమయంలో డ్రైవర్‌ కంగారు పడడంతో అదుపు తప్పిన పిక్నిక్‌ బస్సు లోయలోకి పల్టీ కొట్టింది. ప్రమాదంలో పిక్నిక్‌ వెళ్లిన వారిలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అంబగడా గ్రామానికి చెందిన బైక్‌ నడిపిన వ్యక్తి, వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

8 మంది దుర్మరణం 
ఏప్రిల్‌ 29వ తేదీన రాయగడా నుంచి బరంపురంనకు 60 మందితో వస్తున్న బస్సు ఉదయం 3 గంటల సమయంలో అదుపు తప్పడంతో 8 మంది దుర్మరణం చెందారు. అలాగే 40 మంది ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యారు. స్వయంగా గంజాం జిల్లా కలెక్టర్‌ విజయ్‌ అమృత కులంగా, ఎస్పీ బ్రాజేష్‌ కుమార్‌రాయ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ఓడ్రాప్‌ బృందం సాయంతో క్షతగాత్రులను ఎంకేసీజీ మెడికల్‌ ఆస్పత్రికి తరలించారు.

60 మంది విద్యార్థులకు ప్రమాదం 
ఇదే రోడ్డులో జనవరి చివరి వారంలో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని రవిన్స్‌శా విశ్వ విద్యాలయానికి చెందిన విద్యార్థులు సుమారు 60 మంది బస్సులో గజపతి జిల్లా గండాహతి వాటర్‌ ఫాల్స్‌ వద్దకు పిక్నిక్‌కు వెళ్లారు. వీరు ఆనందంగా గడిపి తిరిగి రాత్రి 10 గంటల సమయంలో వస్తుండగా బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. దీంతో 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

తీవ్ర విషాదం 
ఇటీవల కొందమాల్‌ జిల్లా దరింగబడి నుంచి బరంపురం మీదుగా పశ్చిమబంగా వెళ్తున్న పర్యాటకుల ఏసీ బస్సు వేకువజామున 3 గంటల సమయంలో గంజాం జిల్లా జగన్నాథ్‌ ప్రసాద్‌ బ్లాక్‌ కళింగా ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పి విద్యుత్‌ స్తంభానికి ఢీకొట్టి బోల్తా పడింది. దుర్ఘటనలో 6గురు పర్యాటకులే మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

లోయలో పడిన ట్రక్కు  
అలాగే అక్కడికి కొద్ది రోజుల తర్వాత రాయగడ నుంచి బరంపురం లోడుతో వస్తున్న ట్రాక్కు లోయలోకి పడిపోవడంతో డ్రైవర్‌ మృతి చెందగా, క్లీనర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఇదేవిధంగా పత్తపాణి ఘాటి లోయలో పడిన టాటా సఫారి దుర్ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

చెట్టుని ఢీకొని... 
ఇటీవల గంజాం జిల్లా సురడా బ్లాక్‌ పరిధి తప్తపాణీ–గజలబడి దగ్గర కళింగా ఘాట్‌ రోడ్డులో పెళ్లి బృందం వ్యాన్‌ చెట్టుని ఢీకొనడంతో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కలెక్టర్‌ ఆదేశాలతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బంజనగర్‌ ఆస్పత్రికి తరలించారు.

చదవండి: Orissa Crime News: నా భార్యను చంపేశాను.. డయల్‌ 100కు ఫోన్‌ చేసి..


 

మరిన్ని వార్తలు