కత్తులు, రాళ్లతో దాడి చేసి నగలు, నగదు తస్కరణ

13 Feb, 2021 16:11 IST|Sakshi

ముంబై: దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన తెలుగు వారిపై మహారాష్ట్రలో దోపిడీ దొంగలు దాడికి పాల్పడి దొరికిన సొమ్మును దోచుకెళ్లారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని వాసీలో చోటుచేసుకుంది. బాధితులు తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అయితే దోపిడీ దొంగల దాడిలో గాయపడిన తెలుగువారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

వికారాబాద్‌ జిల్లా బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కె.రాములు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. కుల్కచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ రమేశ్‌. వీరిద్దరూ తమ కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీకి కారులో వెళ్లారు. షిర్డీ యాత్ర ముగించుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. కర్నాటకలోని వాసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి రాగానే దొంగలు వీరి కారును అడ్డగించారు. రోడ్డుపై మేకులు వేసి కారు పంక్చరయ్యేలా చేశారు.

అయితే దొంగలను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో దొంగలు రెచ్చిపోయారు. ఆ కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొడుతూ.. కత్తులతో బెదిరిస్తూ డబ్బులు, ఆభరణాలు వసూల్‌ చేశారు. దీంతో ప్రాణభయంతో వారంతా తమ వద్ద ఉన్న ఆభరణాలు, నగదు ఇచ్చేశారు. ప్రస్తుతం కర్నాటకలోని హుమ్నాబాద్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు.

చిన్న‌పిల్ల‌లు, మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా క‌త్తులు, రాళ్ల‌తో విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేశారని తెలుస్తోంది. వీరి దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరి వ‌ద్ద నుంచి 8 తులాల బంగారు న‌గల‌ను దొంగ‌లు అప‌హ‌రించుకుపోయారు. ఈ ఘటన వాసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు