ఈ రోబో 47 భాషలు మాట్లాడుతూ.. మనుషులను గుర్తిస్తుంది

13 Mar, 2021 14:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ‘రోబో’ చిత్రం నుంచి స్ఫూర్తి పొందిన ఓ ఉపాధ్యాయుడు 47 భాషలు అనర్గళంగా మాట్లాడే మరమనిషిని(రోబో) రూపొందించాడు. దీనికి ‘షాలూ’ అని నామకరణం చేశాడు. ఇది 9 స్థానిక భాషలు, 38 విదేశీ భాషలు మాట్లాడగలదు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన దినేశ్‌ పటేల్‌ ఐఐటీ-బాంబేలోని కేంద్రీయ విద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్‌గా పని చేస్తున్నాడు. ‘రోబో’ చిత్రం చూసిన తర్వాత అలాంటి మరమనిషిని తయారుచేయాలని సంకల్పించాడు.

ప్లాస్టిక్‌, కార్డుబోర్డ్‌, అల్యూమినియం, ఇనుము, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, చెక్క వ్యర్థాలతో ‘షాలూ’కు తుదిరూపం తీసుకొచ్చాడు. ఇందుకోసం మూడేళ్ల సమయం పట్టిందని, రూ.50,000 ఖర్చు చేశానని దినేశ్‌పటేల్‌ వెల్లడించాడు. ఇది ప్రోటోటైప్‌ రోబో అని, 47 భాషలు మాట్లాడడంతో పాటు మనుషులను గుర్తించగలదని, జనరల్‌ నాలెడ్జ్‌, గణితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పగలదని తెలిపాడు. వార్తా పత్రికలను చదువుతుందని, రకరకాల వంటలు ఎలా చేయాలో వివరిస్తుందని అన్నాడు. 

చదవండి: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్!

మరిన్ని వార్తలు