గుజరాత్‌లో ‘నాన్‌–వెజ్‌’ గొడవ!

17 Nov, 2021 05:02 IST|Sakshi

మాంసాహారం అమ్మే తోపుడు బండ్లు, వీధి వ్యాపారాలపై పలు పట్టణాల్లో నిషేధం! 

శుభ్రత పాటించని వాటిపైనే ఆంక్షలంటున్న ప్రభుత్వం  

అహ్మదాబాద్‌: మాంసాహారాన్ని విక్రయించే తోపుడు బండ్లు, వీధి వ్యాపారాలపై గుజరాత్‌లోని పలు నగరపాలికలు ఆంక్షల కొరడా విధించాయి. అశుభ్రమైన పదార్థాలు విక్రయిస్తున్నారంటూ అహ్మదాబాద్, భావ్‌నగర్, రాజ్‌కోట్‌లోని పలు ప్రముఖ వ్యాపార కూడళ్లలోని వీధి వ్యాపారుల బండ్లను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారు. అయితే, దీనిపై ప్రభుత్వ వాదన మరోలా ఉంది. నాన్‌–వెజ్‌కు మేం వ్యతిరేకం కాదని, అశుభ్రమైన, కాలుష్యమయ రోడ్లపై బహిరంగంగా ఆహారపదార్థాల విక్రయాలపైనే తాము దృష్టిపెట్టామని రాష్ట్ర సర్కార్‌ చెబుతోంది.

పౌరుల ఆహారపు అభిరుచులపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులు లేవని, ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ స్పష్టంచేశారు. మరోవైపు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మంగళవారం రోడ్లపై అక్రమ ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అహ్మదాబాద్‌లో వీధి వ్యాపారాలతో రద్దీగా ఉండే ప్రఖ్యాత వస్త్రపూర్‌ లేక్‌ ప్రాంతంలోని స్ట్రీట్‌ఫుడ్‌కు నో చెప్పింది. పాఠశాలలు, కళాశాలలు, గార్డెన్‌లు, మతసంబంధ ప్రాంతాలకు 100 మీటర్ల దూరంలోపు వీధి వ్యాపారాలపై నిషేధం విధించారు. బిజీ రోడ్లపై నాన్‌–వెజ్‌ విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని బీజేపీ పాలిత అహ్మదాబాద్, భావ్‌నగర్, రాజ్‌కోట్, జునాగఢ్, వడోదర మున్సిపల్‌ కార్పొరేషన్లు గత వారం ప్రకటించడంతో వీధి వ్యాపారుల్లో ఆందోళనలు పెరిగాయి.   
 


 

మరిన్ని వార్తలు