ఐదేళ్ల జైలు.. కోటి జరిమానా

30 Oct, 2020 03:59 IST|Sakshi

ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణకు కేంద్రం కొత్త చట్టం

న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి కారణమయ్యే వారికి భారీగా జరిమానా, జైలుశిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిప్రకారం కాలుష్య కారకులకు ఏకంగా కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. గరిష్టంగా ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడే ప్రమాదం కూడా ఉంది. ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ బుధవారం సంతకం చేయడంతో వెంటనే అమల్లోకి వచ్చింది. ఆర్డినెన్స్‌ను కేంద్ర న్యాయ శాఖ గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ నిమిత్తం 22 ఏళ్ల క్రితం నాటి ఎన్విరాన్‌మెంట్‌ పొల్యూషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ అథారిటీ(ఈపీసీఏ)ని రద్దు చేసి, దాని స్థానంలో ఒక ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేస్తారు.

ఈ కమిషన్‌లో 20 మందికిపైగా సభ్యులు ఉంటారు. ఆర్డినెన్స్‌ నియమ నిబంధనలను, ప్రత్యేక కమిషన్‌ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా లేదా ఐదేళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చు. కమిషన్‌ చైర్మన్‌ను కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో రవాణా, వాణిజ్య, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తదితర శాఖల మంత్రులు, కేబినెట్‌ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో ప్రతిఏటా పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. దీనివల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పంట వ్యర్థాల దహనాన్ని, తద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం ఇటీవలే విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

కమిషన్‌ ఏం చేస్తుందంటే..
►ఏయే ప్రాంతాల్లో గాలి నాణ్యతను ఎంత స్థాయిలో ఉండాలో నిర్ధారించే అధికారం కమిషన్‌కు కట్టబెట్టారు.
►చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలు/ప్లాంట్లను కమిషన్‌ తనిఖీ చేస్తుంది.
►అలాంటి కంపెనీలు/ప్లాంట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది.
►కమిషన్‌ తనంతట తానుగా(సుమోటో) లేదా ఫిర్యాదుల ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తుంది.
►కమిషన్‌ తన వార్షిక నివేదికలను నేరుగా పార్లమెంట్‌కు సమర్పిస్తుంది.
►కమిషన్‌ ఆదేశాలను సివిల్‌ కోర్టుల్లో సవాలు చేసేందుకు వీల్లేదు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు.

>
మరిన్ని వార్తలు