జరిమానా విధించినందుకు గొంతు కోశాడు.. సీఎం పరామర్శ.. రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియో

24 Apr, 2022 07:27 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా ఎస్‌ఐ, ఎస్‌ఐ మార్గెడ్‌ థెరిసా (ఫైల్‌)

సాక్షి, చెన్నై: మద్యం మత్తులో వాహనం నడిపిన తనకు దేహశుద్ధి చేయడమే కాకుండా జరిమానా విధించిన మహిళా ఎస్‌ఐపై వాహనదారుడు కక్ష కట్టాడు. భద్రతా విధులలో ఉన్న ఆమెను వెంటాడాడు. పథకం ప్రకారం  గొంతు కోసి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు. వివరాలు.. తిరునల్వేలి జిల్లా సుత్తమల్లి పోలీస్‌ స్టేషన్‌లో మార్గెడ్‌ థెరిసా మహిళా యువ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.

శుక్రవారం రాత్రి పలవూరు గ్రామంలో జరిగిన ఆలయ ఉత్సవాల భద్రతకు ఆమె వెళ్లారు. రాత్రి సమయంలో విధుల్లో ఉన్న  ఆమెపై ఓ వ్యక్తి దాడి చేశాడు. కత్తితో గొంతు  కొసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు, విధుల్లో ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ థెరిసాను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు తిరునల్వేలిలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  

అందుకే కక్ష కట్టాడు.. 
నిందితుడిని సత్తుమల్లికి చెందిన ఆర్ముగంగా గుర్తించారు. గత నెల మద్యంమత్తులో వాహనం నడి పి పోలీసులకు ఆర్ముగం పట్టుబడ్డాడు. మత్తులో మహిళా పోలీసులతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని గుర్తించిన ఎస్‌ఐ థెరిసా అతడికి దేహశుద్ధి చేశారు. జరిమానా విధించి వదిలి పెట్టారు. దీంతో కక్ష కట్టిన ఇతగాడు ఆమెను మట్టుబెట్టేందుకు పథకం వేశాడు. చివరికి ఆలయ ఉత్సవాల్లో గొంతు కోసి తప్పించుకునే క్రమంలో పోలీసులకు చిక్కాడు. దీంతో అతడిపై రెండు సెక్షన్లతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం ఎంకే స్టాలిన్‌ ఎస్‌ఐ థెరిసాను ఫోన్‌ ద్వారా పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియోను ప్రకటించారు. కాగా, ఈ ఘటనపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్‌ పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో గవర్నర్‌కే కాదు, సాధారణ ఎస్‌ఐకు కూడా భద్రత కరువైందని ధ్వజమెత్తారు. 

చదవండి: (Preethi Manoj: రెండువారాలు మృత్యుపోరాటం)

మరిన్ని వార్తలు