రోడ్లతో కాసుల వర్షం.. రూ.లక్ష కోట్లు!

26 Mar, 2021 00:10 IST|Sakshi

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి 

న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ద్వారా వచ్చే ఐదేళ్లలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రూ.లక్ష కోట్లను సమీకరించే ప్రణాళికతో ఉన్నట్టు కేంద్ర రవాణా, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ రంగంలోని కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వచ్చి మంచి అవకాశాలను సొంతం చేసుకోవాలని కోరారు. ఈ నిధులను తిరిగి మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్టు మంత్రి చెప్పారు.

ఇది వృద్ధికి ఊతమిస్తుందన్నారు. జాతీయ అస్సెట్‌ మానిటైజేషన్‌ (ఆస్తులపై ఆదాయం రాబట్టుకోవడం) పైప్‌లైన్‌ మౌలిక సదుపాయాల రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే మంచి కార్యక్రమంగా మంత్రి అభివర్ణించారు. ప్రభుత్వం నూతన డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్‌ (డీఎఫ్‌ఐ)ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధుల అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం దీనికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తన వాటాగా రూ.20,000 కోట్లను సమకూర్చనుంది. ఐదేళ్లలో దీని ద్వారా రూ.5 లక్షల కోట్ల రుణ వితరణ చేయాలన్నది లక్ష్యం. 

ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేక ఈ హైవే
ఢిల్లీ– ముంబై మధ్యనున్న 1,300 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ రహదారి పొడవునా ప్రత్యేకంగా ఈ–హైవేను నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నట్టు గడ్కరీ తెలిపారు. ఈ–హైవేపై బస్సులు, ట్రక్కులు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుంటుందన్నారు. దీనివల్ల రవాణా వ్యయం 70 శాతం తగ్గుతుందని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా మంత్రి తెలిపారు. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.

మరిన్ని వార్తలు