ఆ ఆదేశాలు సరికాదు.. కవాతు కండిషన్స్‌పై ఆరెస్సెస్‌ అసంతృప్తి

5 Nov, 2022 14:38 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో ఆరెస్సెస్‌ నిర్వహించ తలపెట్టిన కవాతుపై సందిగ్ధం నెలకొంది. నవంబర్‌ 6వ తేదీన(ఆదివారం) తలపెట్టిన కవాతును రద్దు చేయాలని ఆరెస్సెస్‌ నిర్ణయించుకుంది. మద్రాస్‌ హైకోర్టు కవాతు నిర్వహణకు అనుమతి ఇచ్చినప్పటికీ.. ప్రత్యేక షరతులు విధించడంపై హిందూ సంఘాల విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెడుతూ మొత్తం 50 ప్రాంతాలకుగానూ.. 44 ప్రాంతాల్లో కవాతు నిర్వహణకు మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం అనుమతులు ఇచ్చింది. మతపరమైన సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ఆరు చోట్ల మాత్రం ఇప్పుడు మార్చ్‌ నిర్వహించొద్దని.. కావాలనుకుంటే మరో రెండు నెలల తర్వాత కవాతు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే.. 

ఆ 44 ప్రాంతాల్లో కూడా రోడ్లపై, ఇతర ప్రాంగణాల్లో కాకుండా.. మైదానాలు, స్టేడియం లేదంటే ఆడిటోరియాల్లో మాత్రమే నిర్వహించాలని షరతు విధించింది. కవాతులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని.. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మద్రాస్‌ హైకోర్టు, ఆరెస్సెస్‌కు స్పష్టం చేసింది. 

అయితే ఈ ఆదేశాలపై ఆరెస్సెస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కశ్మీర్‌, వెస్ట్‌బెంగాల్‌, కేరళ, ఇతర ప్రాంతాల్లో రూట్‌ మార్చ్‌లను నిర్వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమిళనాడులో మాత్రం ఇలా సమ్మేళన ప్రాంగణంలో నిర్వహించుకోవడం సబబు కాదని భావిస్తోంది. అందుకే కవాతును వాయిదా వేసుకోవడంతోపాటు మద్రాస్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేసేందుకు సిద్ధమైంది. 

అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం కేవలం మూడు చోట్ల మాత్రమే కవాతులను నిర్వహణకు అనుమతి ఇవ్వగా.. మద్రాస్‌ హైకోర్టు జోక్యంతో ఆరెస్సెస్‌కు ఊరట లభించింది. ఓ ముస్లిం రాజకీయ సంఘంపై కేంద్రం నిషేధం విధించడం, కొయంబత్తూరు పేలుళ్ల నేపథ్యంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లవచ్చని తమిళనాడు పోలీస్‌ శాఖ.. ఆరెస్సెస్‌ కవాతుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది.

ఇదీ చదవండి: స్టాలిన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు