కరోనా కరోనా వేరయా.. దాని రూపు చిక్కదయ్య

17 Apr, 2021 01:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులకు దొరకని కొత్త వేరియెంట్లు

ప్రతి ఐదుగురిలో ఒకరికి తప్పుడు ఫలితం వచ్చే అవకాశం

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: దగ్గుతో మొదలవుతుంది. ఆపై జ్వరం అందుకుంటుంది. ఊపిరి సరిగా ఆడని ఫీలింగ్‌. కోవిడ్‌ కాదు కదా? అనే భయం. వెంటనే పరీక్షకు వెళతాం. అత్యంత ప్రామాణికమైనదిగా భావించే ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు చేయించుకుంటాం. ‘నెగెటివ్‌’ రాగానే ఊపిరిపీల్చుకుంటాం. ఇక్కడే మ్యుటేషన్‌ చెందిన వైరస్‌ మనల్ని మోసం చేస్తోంది. పరీక్షలకు చిక్కడం లేదు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో ఇదో ఆందోళనకర పరిణామం. ప్రతి ఐదుగురిలో ఒకరికి ఇలా తప్పుడు రిపోర్టు వచ్చే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు రెండు, మూడో టెస్టుల్లోనూ కరోనా సోకినట్లు బయటపడటం లేదు.  

ఎందుకిలా?
గత ఏడాది (2020) ఆరంభం నాటి సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ను గుర్తించే విధంగా ఆర్‌టీపీసీఆర్‌ టెస్టును డిజైన్‌ చేశారు. తర్వాత కోవిడ్‌ వైరస్‌ అనేక మ్యుటేషన్లకు (రూపాంతరితాలకు) లోనైంది. యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ తదితర వేరియెంట్లు ఎన్నో వచ్చాయి. ఈ రూపాంతరిత వైరస్‌ కొమ్ములు, ఇతర ప్రాంతాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో అది దొరకడం లేదు. ఎప్పటివో పాత ఫోటోలు పెట్టుకొని తప్పిపోయిన మనిషిని వెతకడం లాంటి పరిస్థితే ఇది. వేలిముద్రలు, ఐరిస్‌ ఆధారంగా మనుషుల్ని గుర్తించినట్లు... వైరస్‌లోని కొన్ని నిర్దేశిత ప్రాంతాలను (డయాగ్నస్టిక్‌ టార్గెట్స్‌)ను గుర్తించడం ద్వారా ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు కరోనా వైరస్‌ను కనిపెడుతుంది.

వైరస్‌ జన్యుక్రమంలో పలుమార్పులతో ఇప్పుడది సాధ్యపడటం లేదు. యూకే వేరియెంట్‌ వైరస్‌లోని 69–70 ప్రాంతాల్లో ఉండే న్యూక్లియోడైడ్‌ బేసెస్‌ (జన్యు పదార్థం) పూర్తిగా తొలగిపోవడం మూలంగా పరీక్షల కచ్చితత్వంలో తేడాలు వస్తున్నాయి. వైరస్‌ సోకినా నెగెటివ్‌ రావడానికి ఇదే కారణమని పెర్కిన్‌ ఎల్మర్‌ డయాగ్నస్టిక్స్‌ జనరల్‌ మేనేజర్‌ ఆరవింద్‌ కె తెలిపారు. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కూడా తప్పుడు ఫలితాలపై ఈ ఏడాది జనవరిలోనే డాక్టర్లను, పేషెంట్లను హెచ్చరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిన్లాండ్‌లో స్థానిక వేరియెంట్లో న్యూక్లియోప్రొటీన్‌లో తేడాల వల్ల దాన్ని ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో గుర్తించడం కష్టమైంది.


ఫ్రెంచ్‌లోని బ్రిటానీ ప్రాంతంలో ఒక వేరియంట్‌ సోకిన ఎనిమిది మందికీ పీసీఆర్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చింది. రక్త నమూనాలు, ఊపిరితిత్తుల్లో నుంచి తీసిన టిష్యూల ఆధారంగా వారికి కరోనాను నిర్ధారించినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. అలాగే కొందరిలో వైరస్‌ నాసికా రంధ్రాల్లో, గొంతులో కేంద్రీకృతం కాకపోవడం కారణంగా కూడా అక్కడి నుంచి తీసిన నమూనాలను పరీక్షించినపుడు... పాజిటివ్‌ రావడం లేదని డాక్టర్‌ ప్రతిభా కాలే తెలిపారు. భారత్‌లో సెకండ్‌ వేవ్‌లో ఇలా పరీక్షల్లో వైరస్‌ ఏమారుస్తున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. కొన్ని కిట్లపై ఇవి అన్ని కేసుల్లో వైరస్‌ను కచ్చితంగా గుర్తించకపోవచ్చనే ‘గమనిక’ను ముద్రిస్తున్నారు.  

     
ప్రమాదం ఏమిటి?
► ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిందనే ధీమాతో డాక్టర్‌ను సంప్రదించకపోతే పరిస్థితి విషమిస్తుంది. సకాలంలో వైద్య సహాయం అందదు.

► ఇలాగే మూడు, నాలుగు రోజులు ఆలస్యమైతే వ్యాధి తీవ్రత ముదిరి ప్రాణాల మీదకు రావొచ్చు.  

► ఐసోలేషన్‌లో ఉండడు కాబట్టి సదరు వ్యక్తి సూపర్‌ స్ప్రెడర్‌గా మారుతాడు.

► అతని మూలంగా ఇంట్లో వాళ్లకి, సన్నిహితంగా మెలిగే వాళ్లకి హైరిస్క్‌ ఉంటుంది.  

► ట్రాక్‌ చేయడం ఉండదు కాబట్టి... పెళ్లిళ్లు, విందులకు వెళితే ఎంతోమందికి అంటించే ప్రమాదం ఉంటుంది.

► కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా లక్షణాలు కొనసాగుతుంటే... మళ్లీ మళ్లీ టెస్టులకు వెళ్లాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇతర పద్ధతుల్లో నిర్ధారించుకోవాలి. కుటుంబసభ్యులకు దూరంగా ఒక గదిలో ఐసోలేట్‌ కావాలి.

మరిన్ని వార్తలు