ఒమిక్రాన్‌ జాడ ఇలా తెలుస్తుంది!

1 Dec, 2021 05:15 IST|Sakshi

ఆర్‌టీ–పీసీఆర్, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల్లో ఒమిక్రాన్‌ జాడ తెలుస్తుంది

కరోనా పరీక్షల సంఖ్య పెంచండి

రాష్ట్రాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ: తాజాగా ప్రపంచవ్యాప్తంగా అందరి ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌.. ఆర్‌టీ–పీసీఆర్, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల నుంచి తప్పించుకోలేదని, టెస్టుల్లో దాని జాడ ఖచ్చితంగా తెలుస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రసర్కార్‌ సూచించింది.

రాష్ట్రాలు/యూటీల ఉన్నతాధికారులతో మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వర్చువల్‌ పద్ధతిలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ, నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్‌ తదితరులు పాల్గొన్నారు. ‘ వైరస్‌ నిర్ధారణ పరీక్షల నుంచి ఒమిక్రాన్‌ తప్పించుకోలేదు. టెస్టుల్లో దాని జాడ ఖచ్చితంగా తెలుస్తుంది. పరీక్షల సంఖ్యను పెంచడం ద్వారా ఈ రకం వేరియంట్‌ వ్యాప్తిని ముందుగానే అరికట్టేందుకు ఆస్కారముంది’ అని బలరాం అన్నారు. 

ఫలితాలొచ్చేదాకా ఎయిర్‌పోర్ట్‌లోనే.. 
బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బొట్సావానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్‌ దేశాల నుంచి భారత్‌కు ప్రయాణికులు వస్తే వారికి ఎయిర్‌పోర్టులోనే ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్ట్‌ చేస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘ఆ టెస్ట్‌ రిపోర్ట్‌ వచ్చేదాకా ఆయా ప్రయాణికులంతా ఎయిర్‌పోర్టులోనే వేచిఉండాలి. ఈ నిబంధన డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానుంది. ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్ట్‌కు, టెస్ట్‌ రిజల్ట్‌ వచ్చే దాకా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నపుడు ఆహారం కోసం మొత్తంగా రూ.1,700 ఖర్చుకానుంది’ అని ఆరోగ్య శాఖ తెలిపింది. 

ఒమిక్రాన్‌తో ‘హై రిస్కే’: డబ్ల్యూహెచ్‌వో
ఒమిక్రాన్‌పై ఇప్పటిదాకా చేసిన పరిశోధనలు, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ వేరియంట్‌ను ‘హై రిస్క్‌’ కేటగిరీలోనే కొనసాగిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)పునరుద్ఘాటించింది. రానున్న కొద్ది రోజుల్లో ఇది తీవ్ర పరిణామా లకు దారి తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని డబ్ల్యూహెచ్‌వో వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రతను లెక్కిస్తే అది భారీస్థాయిలోనే ఉండొచ్చని సంస్థ రఅభిప్రాయపడింది.  జపాన్‌లో ఒమిక్రాన్‌ తొలి కేసు నమోదైంది.  

మరిన్ని వార్తలు