ఆ దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు.. కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి!

28 Dec, 2022 21:15 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత్‌ తగిన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లోనే రాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. చైనా సహా మరో ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్‌ ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరిగా చూపించాలనే నిబంధనలు తీసుకురానుందని పేర్కొన్నాయి. 

ఈ క్రమంలోనే వచ్చే 40 రోజులు చాలా కీలకమని, జనవరిలో కరోనా కేసులు పెరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించారు అధికారులు. దేశంలో నాలుగో వేవ్‌ వచ్చినా మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి. గతంలో తూర్పు ఆసియాలో కోవిడ్‌ విజృంభించిన 30-35 రోజుల తర్వాత భారత్‌లో కొత్త వేవ్‌ వచ్చిందని గుర్తు చేశాయి. ఇప్పుడు అదే ట్రెండ్‌ నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు 72 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌, ‘ఎయిర్‌ సువిధ’ ఫారమ్‌లో వివరాల నమోదు వంటి నిబంధనలు మళ్లీ తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు పేర్కొన్నాయి. 

ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సుమారు 6000 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. అందులో గత రెండు రోజుల్లోనే 39 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్‌ మాండవియా బుధవారం సందర్శించనున్నారని సమాచారం.

ఇదీ చదవండి: కరోనా అలర్ట్‌: జనవరి గండం ముందే ఉంది.. కేంద్రం వార్నింగ్‌ ఇదే..

మరిన్ని వార్తలు