రష్యా నుంచి రెండో కరోనా వ్యాక్సిన్‌

15 Oct, 2020 17:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ రాకుండా నిరోధించేందుకు ‘ఎపివాక్‌ కరోనా వ్యాక్సిన్‌’ పేరిట రెండో వ్యాక్సిన్‌కు రష్యా బుధవారం ఆమోదం తెలిపింది. కరోనా వైరస్‌ సోకకుండా ఈ వ్యాక్సిన్‌ ఆరు నెలలపాటు అండుకుంటుందని పేర్కొంది. వంద మంది వాలంటీర్లపైన రెండు విడతలుగా ప్రయోగాలు జరిపిన అనంతరం ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రష్యా ప్రభుత్వం అనుమతివ్వడం గమనార్హం. మొదటి వ్యాక్సిన్‌ లాగానే ఈ వ్యాక్సిన్‌పై కూడా ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ ఏమిటో తెలసుకునేందుకు కీలకమైన తతీయ ట్రయల్స్‌ను నిర్వహించలేదు. (గుండెపోటు మరణాలే ఎక్కువ!)

రెండో వ్యాక్సిన్‌ రెండు విడుతల ప్రయోగాల వివరాలను బహిర్గతం చేయకుండానే ఈ వ్యాక్సిన్‌ ఆరు నెలల పాటు కరోనాను అడ్డుకుంటుందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సిన్‌తో వాలంటీర్లలో రోగ నిరోధక శక్తి పెరిగిందని, దాన్ని బట్టే ఈ వ్యాక్సిన్‌ పని చేస్తున్నట్లు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాను నిరోధించేందుకు మొదటి వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్ వి’ని కనుగొన్నట్లు దేశ ప్రజలనుద్దేశించి టీవీలో మాట్లాడుతూ చెప్పినట్లే ఈ సారి కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ టీవీ ముఖంగా ప్రజలకు తెలియజేశారు. ఇప్పటి వరకు రష్యా శాస్త్రవేత్తలు కనుగొన్న రెండు వ్యాక్సిన్‌ డోస్‌లను ఉత్పత్తి చేస్తామని, వాటిని ముందుగా దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రాధాన్యతనిస్తామని ఆయన చెప్పారు.

తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఆగస్టు 11వ తేదీన రష్యా ప్రభుత్వం అనుమతించగా, రెండో వ్యాక్సిన్‌ను ఈ రోజే అనుమతించింది. మొదటి వ్యాక్సిన్‌ను మాస్కోలోని గామాలయ ఇనిస్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోండగా, రెండో వ్యాక్సిన్‌ను వెక్టర్‌ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. తొలి విడుత కింద 60 వేల డోసులను ఉత్పత్తి చేస్తామని వెక్టర్‌ కంపెనీ ప్రకటించింది. మొదటి వ్యాక్సిన్‌ ముందుగా రష్యాలోని డాక్టర్లకు, టీచర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ వ్యాక్సిన్‌ ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’కు సంబంధించి కీలకమైన మూడో విడత ప్రయోగాల్లో భాగంగా 40 వేల మంది వాలంటీర్లకు ఈ నెలలో వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఇలాంటి ట్రయల్స్‌ రష్యా రెండో వ్యాక్సిన్‌పై నవంబర్‌ లేదా డిసెంబర్‌లో జరుగుతాయని, ఆలోగా ప్రాధాన్యత రంగాలకు తొలి విడత డోస్‌లను సరఫరా చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువున్న దేశాల్లో రష్యా నాలుగవ దేశం. ఇంతవరకు అక్కడ 13 లక్షల మంది వైరస్‌ బారిన పడగా 23 వేల మంది మరణించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు