రష్యా నుంచి ఎస్‌–400 మిస్సైల్‌ సిస్టమ్‌ రాక

16 Apr, 2022 06:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒకవైపు ఉక్రెయిన్‌పై యుద్ధంపై కొనసాగిస్తున్న రష్యా మరోవైపు ఒప్పందం ప్రకారం భారత్‌కు ఎస్‌–400 ట్రయంఫ్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ సరఫరాను ప్రారంభించింది. ఈ వ్యవస్థకు సంబంధించిన కొన్ని భాగాలు భారత్‌కు చేరుకోవడం మొదలయ్యిందని అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. మరికొన్ని కీలక విడిభాగాలు రావాల్సి ఉందని తెలిపాయి. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ మిస్సైల్‌ సిస్టమ్‌ సరఫరాపై భారత్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. జాప్యం జరిగే అవకాశం ఉందని భావించింది. అయినప్పటికీ ఒప్పందం ప్రకారం సరఫరా ప్రారంభం కావడం విశేషం. ఎస్‌–400 క్షిపణి వ్యవస్థకు సంబంధించి సెకండ్‌ రెజిమెంట్‌ భాగాలు భారత్‌కు రావడం మొదలయ్యిందని అధికారులు పేర్కొన్నారు. సైనిక శిక్షణకు ఉద్దేశించిన సిమ్యులేటర్లు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్షిపణి వ్యవస్థకు చెందిన మొదటి రెజిమెంట్‌ భాగాలను రష్యా గత ఏడాది డిసెంబర్‌లో సరఫరా చేసింది. ఎస్‌–400 మిస్సైల్‌ సిస్టమ్‌ భారత్‌–చైనా, భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాలను కవర్‌ చేస్తుందని అధికారులు తెలియజేశారు. భారత్‌కు ఎస్‌–400 సరఫరా విషయంలో.. తమపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం ఏదీ ఉండదని రష్యా ఇటీవలే స్పష్టం చేసింది. ఎస్‌–400 ట్రయంఫ్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఐదు యూనిట్ల కొనుగోలు కోసం భారత్‌ 2018 అక్టోబర్‌లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.5 బిలియన్‌ డాలర్లు. దీనిపై అప్పట్లో అమెరికా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ భారత్‌ లెక్కచేయలేదు. ఒప్పందంపై తమ మాట వినకుండా ముందుకు వెళితే భారత్‌పై ఆంక్షలు విధిస్తామని డొనాల్డ్‌ ట్రంఫ్‌ ప్రభుత్వం హెచ్చరించింది.

మరిన్ని వార్తలు