ఎంత పనిచేశావ్ పుతిన్‌.. భారత్‌కు గట్టి షాక్‌

2 Jun, 2022 08:06 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తోంది. తిండి గింజల కొరత, నిత్యావసరాలు, చమురు ధరల పెరుగుదల... ఇలా అన్ని దేశాలకూ ఏదో రకంగా సెగ తగులుతోంది. మన దేశంపై కూడా యుద్ధ ప్రభావం గట్టిగానే పడుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ గత మూడు నెలల్లో నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ పైకి ఎగబాకుతుండటంతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా వెనక్కు తీసుకుంటుండటం వంటి పరిణామాలతో ఆర్థిక రంగం కూడా నానా కుదుపులకు లోనవుతోంది. 

చమురు భగభగలు..


యుద్ధం పుణ్యమా అని అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు రూపాయి పతనం కూడా తోడవటంతో మరింతగా మోతెక్కిపోతున్నాయి. ఈ ఏడాది మొదట్లో 80 డాలర్లున్న బ్యారెల్‌ చమురు ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడికి దిగాక ఈ మూడు నెలల్లో 128 డాలర్లకు పెరిగింది.  

వంటింట్లో మంటలు..


రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం భారతీయుల వంట గదిలోనూ సెగలు రేపుతోంది. ఏడాది క్రితంతో పోలిస్తే వంట నూనెల ధరలు నాలుగో వంతు దాకా పెరిగిపోయాయి. 2021 మే 31తో పోలిస్తే గోధుమలు 14 శాతం, చక్కెర 4 శాతం, ఉత్తరాదిన విరివిగా వాడే ఆవ నూనె 5 శాతం చొప్పున పెరుగుదల నమోదు చేశాయి.  

పెట్టుబడులు వాపస్‌..


ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత మార్కెట్ల నుంచి గత మూడు నెలల్లో ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా వెనక్కు తీసుకున్నారు. అంతకుముందు 9 నెలల ఉపసంహరణ కంటే కూడా ఇది 50 వేల కోట్ల రూపాయలు ఎక్కువ! యుద్ధం దెబ్బకు ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దీంతో అంతర్జాతీయంగా తలెత్తిన ఒడిదొడుకులను తట్టుకునే చర్యల్లో భాగంగా భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు ఇలా పెట్టుబడులను భారీగా వెనక్కు తీసుకుంటున్నారు. 

రూపాయి నేలచూపులు..


యుద్ధం దెబ్బకు డాలర్‌తో రూపాయి  పతనం గత మూడు నెలల్లో వేగం పుంజుకుంది. ఫిబ్రవరి 24న డాలర్‌తో 75.3 వద్ద కదలాడిన రూపాయి మే 31 నాటికి 77.7కు పడిపోయింది. ఇది దిగుమతులపై, ముఖ్యంగా చమురు దిగుమతులపై బాగా ప్రభావం చూపింది. ఎఫ్‌పీఐల ఉపసంహరణ కూడా రూపాయి పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.  దీనికి తోడు  భారత్‌లో ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్‌ నాటికే ఏకంగా 7.8 శాతానికి పెరిగింది!  2014 మే తర్వాత ద్రవ్యోల్బణం ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. 
-నేషనల్‌ డెస్క్‌, సాక్షి.

మరిన్ని వార్తలు