భారత్‌-చైనా వివాదంపై స్పందించిన రష్యా.. ఆ దేశాల్లా కాదని కీలక వ్యాఖ్యలు

23 Sep, 2022 20:26 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు వివాదంపై రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎ‍ట్టిపరిస్థితుల్లోనూ తాము ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సమస్య అని.. భారత్, చైనానే చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈమేరకు భారత్‌కు రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ శుక్రవారం తెలిపారు.

కొన్ని దేశాలు చైనా పట్ల, మరికొన్ని దేశాలు భారత్ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని డెనిస్ అన్నారు. కానీ తాము అలా కాదని చెప్పారు. వీలైనంత త్వరగా రెండు దేశాలు పరస్పర అంగీకారంతో ఓ తీర్మానానికి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ చర్చల్లో ఇతర దేశాల పాత్ర అవసరం లేదని తాము అభిప్రాయపడుతున్నట్లు వివరించారు. 

అలాగే ఒప్పందం ప్రకారం భారత్‌కు తాము అందించాల్సిన ఎస్‌-400 వాయు క్షిపణి వ్యవస్థ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. 5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఈ ఒప్పందం భారత్-రష్యా మధ్య 2018 అక్టోబర్‌లో కుదిరింది. దీని ప్రకారం ఐదు యూనిట్ల వాయు క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్‌కు అందించాల్సి ఉంది.

2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పటినుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 16 సార్లు కార్ప్స్ కమాండర్  స్థాయి చర్చలు జరిపిన అనంతరం సెప్టెంబర్ 12న గోగ్రా హాట్‌స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి.
చదవండి: 'పేసీఎం' పోస్టర్‌పై ఫోటో.. కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చిన నటుడు

మరిన్ని వార్తలు