సరిహద్దు ఉద్రిక్తతలపై స్పందించిన జై శంకర్‌

27 Aug, 2020 13:07 IST|Sakshi

సరిహద్దులో శాంతి, పొరుగు దేశాలతో సఖ్యతే ముఖ్యం

న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్‌  సరిహద్దు ప్రాంతంలో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ స్పందించారు. గత 45 ఏళ్లలో ఇంత తీవ్రమైన పరిస్థితిని ఇంతవరకు ఎప్పుడు చూడలేదని తెలిపారు. 1962 ఇండో-చైనా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘1962 యుద్ధం తర్వాత ఎల్‌ఏసీ వెంబడి ఇంతటి ఉద్రిక్తతను గతంలో ఎన్నడూ చూడలేదు. 45 సంవత్సాల తర్వాత ఈ ఏడాది సరిహద్దులో సైనిక ప్రాణనష్టం జరిగింది. ఎల్‌ఏసీ వెంట ఇంత భారీ ఎత్తున దళాలు మోహరించడం 45 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం’ అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో​ శాంతితో పాటు పొరుగు దేశాలతో మంచి సంబంధాలే భారత్‌కు ముఖ్యమని ఇప్పటికే చైనాకు స్పష్టంగా తెలిజశామన్నారు. గతంలో ఇరుదేశాల మధ్య తలెత్తిన సరిహద్దు సమస్యలను దౌత్యంపరంగానే పరిష్కరించుకున్నామన్నారు. ఇప్పుడు కూడా భారత్‌ శాంతియుతంగానే వ్యవహరిస్తుందని.. సరిహద్దులో యథాతథ స్థితి పునరుద్దరణ కోసం  కృషి చేస్తోందన్నారు జైశంకర్‌. (చదవండి: సాయుధులుగానే ఉన్నారు)

అయితే ఇది ఏకపక్షంగా సాధ్యం కాదని.. చైనా కూడా సహకరించాలన్నారు జైశంకర్‌. ఇరు దేశాల చర్చల ద్వారా ఒక పరిష్కారానికి రావాలని కోరారు. ఎల్ఏసీ వెంట అతిక్రమణలు, దళాల మోహరింపు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అతిక్రమణలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. వీటిని నిరోధించడానికి ప్రభుత్వం శాంతియుత పరిష్కారం కోరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నుంచి భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదం​కొనసాగుతుంది. ఇక జూన్‌ 15న చైనా- భారత్‌ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులను డ్రాగాన్‌ దేశం పొట్టనపెట్టుకుంది. దీనిని భారత్‌ తీవ్రంగా పరిగణించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు