గెహ్లాట్‌ సీనియర్‌ లీడర్‌.. రాజస్తాన్‌ సీఎంపై సచిన్‌ పైలట్‌ కీలక వ్యాఖ్యలు

21 Sep, 2022 12:57 IST|Sakshi

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో సీనియర్ల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. కాగా, కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలోకి రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ దిగడం దాదాపు ఖాయమైంది. ఆయనకు పోటీగా తాజాగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ కూడా తెరపైకి వచ్చారు. దీంతో, రాజస్థాన్‌ సీఎం ఎవరూ అనేది రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో మరో కీలక నేత సచిన్‌ పైలట్‌ తెరమీదకు వచ్చారు. ఈ తరుణంలో సచిన్‌ పైలట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్రలో పాల్గొనేందుకు కేర‌ళ వ‌చ్చిన స‌చిన్ పైల‌ట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అశోక్ గెహ్లాట్ చాలా సీనియర్ నాయకుడు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది రాజస్థాన్ ఎన్నికల్లో గెలవడమే మా లక్ష్యం’ అని తెలిపారు. ఈ క్రమంలోనే రాజస్తాన్‌ ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు పైలట్‌ సమాధానం ఇస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న నేను అంగీకరిస్తానని స్పష్టం చేశారు. 

మరోవైపు.. పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై ఢిల్లీ వెళ్తే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందన్న కారణంగా విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంపై పట్టు వదులుకోవడానికి గెహ్లాట్‌ అస్సలు సుముఖంగా లేరని సమాచారం. ఒకవేళ తాను సీఎంగా తప్పుకుంటే తన స్థానంలో తన విశ్వాసపాత్రున్ని సీఎం చేయాలని అధిష్టాన్నాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. కాగా, కొద్దిరోజులుగా గెహ్లాట్‌, పైలట్‌ మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్న కారణంగా ఇది అధిష్టానానికి కొత్త తలనొప్పిగా పరిణమించిందని సమాచారం. ఇక, స్పీకర్ సీపీ జోషి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఒకరు అవడంతో తాను కూడా సీఏం రేసులో ఉన్నానన్న సంకేతాలిస్తున్నారు. దీంతో రాజస్థాన్ తదుపరి సీఏంగా ఎవరిని ఎంపిక చేస్తుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. 2023 డిసెంబర్ వరకు రాజస్థాన్ శాసనసభ పదవీకాలం ఉంది.

మరిన్ని వార్తలు