ఆ పేలుడు పదార్దాలు తెచ్చింది వాజేనే!

1 Apr, 2021 14:13 IST|Sakshi

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలోని ఒక వాహనంలో కనుగొన్న జిలటెన్‌ స్టిక్స్‌ను పోలీసు అధికారి సచిన్‌ వాజేనే సమీకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయితే ఆ పేలుడు పదార్థాలను వాజే ఎక్కడనుంచి సంపాదించారన్నది చేశారన్నది మాత్రం వెల్లడించలేదు. అంతే కాకుండా వాజే, అతని డ్రైవర్‌ కలిసి సదరు ఎస్‌యూవీని అంబానీ ఇంటివద్ద పార్క్‌ చేసినట్లు సైతం కనుగొన్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. స్పాట్‌లో వాజే ఉన్నట్లు చూపే సీసీటీవీ ఫుటేజ్‌ లభించినట్లు తెలిపింది. ఫిబ్రవరి 25న దక్షిణ ముంబయిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపాన కనుగొన్న పేలుడు పదార్థాల వాహనం కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది.  

ఈ కేసులో మార్చి 13న అరెస్టు, సస్పెన్షన్‌కు గురైన పోలీసు అధికారి వాజే, ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నారు. విచారణలో భాగంగా ముంబై పోలీసు కమిషనర్‌ ఆఫీసు కాంపౌండ్‌ సీసీటీవీ ఫుటేజ్‌ను సైతం ఎన్‌ఐఏ సేకరించనుంది. దీని ద్వారా వాజే కదలికలు మరింతగా తెలుస్తాయని ఎన్‌ఐఏ భావిస్తోంది. కమిషనర్‌ ఆఫీసు సీసీటీవీ ఫుటేజ్‌ని, డీవీఆర్‌లను ధ్వంసం చేయడానికి యత్నాలు జరిగినా, సింహభాగం ఫుటేజ్‌ సురక్షితంగానే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ధ్వంసంలో వాజే పాత్రపై ఎన్‌ఐఏ ఆరా తీయనుంది. ఇప్పటికే సాకేత్‌ సొసైటీ సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్‌లను ధ్వంసం చేయడానికి వాజే యత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఆదివారం మిథి నది నుంచి ఎన్‌ఐఏ ఒక ల్యాప్‌టాప్, ప్రింటర్, రెండు హార్డ్‌ డిస్కులు, రెండు నెంబర్‌ప్లేట్లు, రెండు డీవీఆర్స్, రెండు సీపీయూల్లాంటి కీలకమైన ఆధారాలను సేకరించింది.  

ఇన్నోవా నడిపింది కూడా అతనే 
పేలుడు పదార్ధాలున్న స్కార్పియోకు తోడుగా వచ్చిన ఇన్నోవాను సచిన్ ‌వాజేనే డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చారని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. స్కార్పియోను వాజే డ్రైవర్‌ నడుపుతూ తెచ్చి ఉంటాడని తెలిపాయి. ఈ కేసులో ఎన్‌ఐఏ విచారణకు ముందు ఏటీఎస్‌ విచారణ జరిపింది. అయితే వాజే పేరు ఇందులో రావడంతో ఆయన సాక్ష్యాల ధ్వంసానికి పాల్పడవచ్చని ఏటీఎస్‌ భావించింది. దీంతో వాజే కదలికలపై నిఘా పెట్టిందని అధికారులు వివరించారు. ఈ నిఘా ఆపరేషన్‌ ఏటీఎస్‌ డీఐజీ శివ్‌దీప్‌ లాండే నేతృత్వంలో జరిగింది. నిఘా కారణంగానే ఇన్నోవా ఇప్పటికీ సురక్షితంగా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. 

ఇక పేలుడు పదార్ధాలున్న స్కార్పియో, అంబానీ ఇంటి వద్ద నిలపడానికి ముందు ఫిబ్రవరి 19-21 మధ్య కమిషనర్‌ ఆఫీసులోఉంది. ఫిబ్రవరి 17న దాని ఓనర్‌ హిరేన్‌ స్కార్పియోను ములంద్‌ బ్రిడ్జి వద్ద వదిలి మర్నాడు తన బండి పోయిందని కంప్లైంట్‌ ఇచ్చాడు. దాన్ని పోలీసులు కనుగొన్న తర్వాత 19 తారీఖున కమిషనర్‌ ఆఫీసుకు తెచ్చారు. అనంతరం 21న హౌసింగ్‌ సొసైటీకి, 24న అంబానీ ఇంటివద్దకు వాజే తరలించారని పోలీసు వర్గాలు తెలిపాయి. 

చదవండి:

వాజే టార్గెట్‌ వంద కోట్లు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు