సీనియర్ల లేఖపై సల్మాన్‌ ఖుర్షీద్‌ అసంతృప్తి

30 Aug, 2020 18:49 IST|Sakshi

సోనియాను సంప్రదిస్తే సరిపోయేది

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వ వ్యవహారంపై పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారని సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. పార్టీ ప్రక్షాళనతో పాటు పూర్తికాల అధ్యక్షుడి ఎంపికపై సీనియర్లు సోనియా గాంధీకి లేఖ రాయడంపై ఖుర్షీద్‌ స్పందిస్తూ సోనియాకు వారంతా సన్నిహితులేనని లేఖ రాసే బదులు ఆమెతో సంప్రదింపులు జరిపి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. సీనియర్లు రాసిన లేఖపై సంతకం చేయాలని వారు నన్ను కలిసినా తాను సంతకం చేసి ఉండేవాడిని కాదని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీకి సోనియా, రాహుల్‌ వంటి నేతలున్నారని, నేతలను తక్షణమే ఎన్నుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాహుల్‌ గాంధీని తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని నేతలు కోరడం కంటే నిర్ణయాన్ని ఆయనకే వదిలివేయాలని సూచించారు. పార్టీ చీఫ్‌గా రాహుల్‌ ముందుకొస్తారా అని అడగ్గా సీనియర్ల లేఖపై రాహుల్‌ ఆలోచించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారని ఖుర్షీద్‌ చెప్పారు. చదవండి : ఇదే ప్ర‌భుత్వానికి నేనిచ్చే స‌ల‌హా‌: సోనియా

ఇక సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతారని ఇటీవల సుదీర్ఘంగా సాగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించారు.కాగా, కాంగ్రెస్‌ పార్టీని ప్రక్షాళన చేయాలని, అన్ని స్ధాయిల్లో చురుకుగా ఉండే పూర్తికాల అధ్యక్షులను నియమించాలని 23 మంది కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీకి రాసిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబల్‌, మనీష్‌ తివారీ, ఆనంద్‌ శర్మ వంటి 23 మంది నేతలు సంతకాలు చేశారు. కాగా సోనియా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ లేఖ రాయడం పట్ల సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్‌ సీనియర్‌ నేతలపై మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని సీనియర్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్‌ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన సీనియర్లు రాజీనామాకు సిద్ధపడగా వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు