UP Elections 2022: ఎన్నికలలో పొత్తు పై అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం

1 Jul, 2021 21:29 IST|Sakshi

లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని ఆయన ప్రకటించారు. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య విప్లవానికి దారి తీస్తాయని అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ పూర్తిగా మర్చిపోయిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ చెత్తబుట్టలో పడేసిందని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాలు గాను తమ పార్టీ 350 పైగా స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. యూపీ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 3050 పంచాయితీల్లో స్వతంత్ర అభ్యర్థులు 1081 స్థానాల్లో గెలుపొందారు. సమాజ్‌వాది పార్టీ మద్ధతుతో బరిలో నిలిచినవారు 851 పంచాయితీలు గెలుచుకోగా.. బీజేపీ మద్ధతుతో పోటీచేసిన వారు 618 పంచాయితీలు గెలుచుకున్నారు. బీఎస్పీ మద్ధతుపొందిన అభ్యర్థులు 320 పంచాయితీల్లో విజయం సాధించారు.
 

>
మరిన్ని వార్తలు