సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

10 Oct, 2022 09:49 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

82 ఏళ్ల ములాయం సింగ్‌ యాదవ్‌.. యూపీకి మూడుపర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్‌ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్టోబర్‌ 2న ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.

ములాయం సింగ్‌ యాదవ్‌..  1967లో తొలిసారిగా ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్‌ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ ప్రస్తుతం సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 

ములాయం మృతి పట్ల ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించడంతో పాటు సైఫయిలో అధికారిక లాంఛనాలతో ములాయం అంత్యక్రియలకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని వార్తలు